రివ్యూ : పందేనికి దిగాడు ..కానీ

355

కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడాల్లేకుండా మార్కెట్ సొంతం చేసుకున్న నటుడు విశాల్ సీక్వెల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2005లో విజయం సాధించి విశాల్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన ‘పందెంకోడి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘పందెం కోడి’సినిమాతో వచ్చాడు. 13 ఏళ్ళ తరువాత లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథేమంటే..

కడప జిల్లాలోని ఎన్నో గ్రామాలను కంటి చూపుతో శాసించే పెద్ద మనిషి రాజారెడ్డి (రాజ్‌ కిరణ్‌). ఏడేళ్ళ క్రితం వీరభద్ర స్వామి జాతరలో జరిగిన గొడవలో భవానీ (వరలక్ష్మీ శరత్‌ కుమార్‌) భర్త హత్యకు గురవుతాడు. భర్తను చంపిన వారి కుటుంబంలో అందరినీ చంపేసిన భవానీ మనుషులు గోపి అనే కుర్రాన్ని చంపలేకపోతారు. ఆ కుర్రాన్ని కూడా చంపి పగ తీర్చుకోవాలని ఎదురుచూస్తుంటారు. జాతర చేయకపొవటంతో కరువు తాండవిస్తుంది. ఎలాగైనా జాతర చేయాలని అన్ని ఊర్లను ఒప్పించి జాతర పనులు మొదలు పెడతాడు రాజారెడ్డి. రాజా రెడ్డి కొడుకు బాలు(విశాల్) జాతర కోసం ఊరికి వస్తాడు. జాతర మొదలైన నాలుగో రోజు రాజారెడ్డి గాయపడతాడు. రాజా రెడ్డి మీద దాడి జరిగిన విషయాన్ని బాలు బయటకి చెప్పుకుండా దాచి జాతర ఆగకుండా జాగ్రత్త పడతాడు. జాతర పూర్తయ్యే వరకు బాలు అసలు విషయం ఊరి ప్రజలకు తెలియకుండా ఆపగలిగాడా.? భవానీ మనుషుల నుండి గోపి ప్రాణాన్ని కాపాడాడా.? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

2005లో ‘పందెం కోడి’తో ఆకట్టుకున్న లింగుస్వామి సీక్వెల్‌ లో తడబడ్డాడు. అవుట్‌ డేటెడ్‌ కథా కథనాలతో ముందుకు వచ్చాడు. విశాల్‌ ఇమేజ్‌, బాడీ లాంగ్వేజ్‌ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. సినిమా కేవలం వారం రోజులు పాటు జరిగే ఓ జాతరకు సంబంధించినది కావటంతో సన్నివేశాలు నెమ్మదిగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. విశాల్‌, కీర్తి సురేష్ మధ్య కెమిస్ట్రీ అలరిస్తుంది.

పందెం కోడి హిట్ట‌వ్వ‌డానికి చాలా కార‌ణాలున్నాయి. యాక్ష‌న్ తో పాటు ల‌వ్ స్టోరీ, ఎమోష‌న్స్ ఉన్నాయి. మీరా జాస్మిన్ పాత్ర‌ గ‌మ్మ‌త్తుగా అనిపిస్తుంది. అందుకే ‘పందెంకోడి 2’ మొదటి భాగానికి మించిన మ‌సాలా ఆశిస్తారు. తొలి స‌గాన్ని ఫైట్ల‌తోనే గ‌డిపేసాడు. మీరా జాస్మిన్‌కి జిరాక్స్ కాపీలాంటి పాత్ర కీర్తి సురేష్‌ది. ఈ యాక్ష‌న్‌ సినిమాలో కీర్తినే కాస్త ఊర‌ట అని చెప్పాలి.  సెకండాఫ్‌లో పెద్ద‌గా మెరుపులు క‌నిపించ‌వు. క్లైమాక్స్ లో వ‌ర‌ల‌క్ష్మి చేత వీర విహారం చేయించాల‌ని చూసారు.

ఎవరెలా..

విశాల్‌ తనదైన మాస్‌ యాక్షన్‌తో మెప్పించాడు. సెకండ్‌ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లో విశాల్ నటన ఆకట్టుకుంది. హీరోయిన్‌గా కీర్తి సురేష్‌కు మరో మంచి పాత్ర దక్కింది. రాజా రెడ్డి పాత్రలో రాజ్‌కిరణ్ ఒదిగిపోయారు. ఆయన లుక్‌, బాడీ లాంగ్వేజ్‌ హుందాగా ఉన్నాయి. నెగెటివ్‌ రోల్‌ వరలక్ష్మీ లుక్‌, స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగుంది.

ఫైనల్ గా..

మాస్ కోసమే ఈ ‘పందెంకోడి’.