కత్తిని క్షమించేసి ‘వాల్మీకి’ని చేసేసారు

422

శ్రీ‌రాముడిపై క‌త్తి మ‌హేష్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం, దాంతో ఆగ్ర‌హించిన పరిపూర్ణానంద స్వామి యాత్ర‌కు సిద్ధమయ్యారు. ఈ నేప‌థ్యంలో క‌త్తి మ‌హేష్ ను హైద‌రాబాద్ నుంచి పోలీసులు బ‌హిష్క‌రింఛి స్వామిని మూడు రోజుల‌పాటు గృహ‌నిర్బంధం త‌ర్వాత‌ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ విధించారు.

తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన పరిపూర్ణానంద‌ విజ‌య‌వాడ‌లో మాట్లాడారు. క‌త్తి మ‌హేష్ ను ఆయ‌న క్ష‌మించేస్తున్నానన్నారు. త‌ను చేసిన పొర‌పాటును గుర్తించే స‌మ‌యం క‌త్తి మ‌హేష్ లో మొద‌లైంద‌ని ప‌రిపూర్ణానంద చెప్పారు. కాబ‌ట్టి, మ‌నస్ఫూర్తిగా ఆయ‌న్ని హిందూ స‌మాజం అక్కున చేర్చుకోవాల‌ని అన్నారు. హిందూ ధ‌ర్మం గొప్ప‌త‌నం అదేన‌న్నారు.

‘ఆయ‌న ఒక బోయ‌వాడిగా గాయ‌ప‌ర‌చారు వాల్మీకిగా గానం చేసారు. వాల్మీకి అంత వ్య‌క్తి అని నేను చెప్ప‌లేక‌పోవ‌చ్చు. బోయ‌వాడు లాంటివాడ‌నీ చెప్ప‌క‌పోవ‌చ్చు. ఆయ‌న‌కి విద్య ఉంది. మేధాసంప‌త్తి ఉంది. రాముడి గురించి ఆయ‌న స‌రిగ్గా అర్థం చేసుకుంటే రామ‌ధ‌ర్మాన్ని తెలుసుకుంటే ఆయ‌న చాలా గొప్ప వ్య‌క్తి కాగ‌ల‌డు. అతి త్వ‌ర‌లో క‌త్తి మ‌హేష్ కు రాముడి అనుభూతి క‌లుగుతుంది. రామ‌నామం గొప్ప‌త‌నం తెలియాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్న’ అన్నారు.

ఇదే సంద‌ర్భంలో ప్ర‌భుత్వాల బాధ్య‌త గురించి మాట్లాడారు. క‌ఠిన‌మైన చ‌ట్టాలు తీసుకొచ్చి, ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన‌ బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంద‌నీ, అప్పుడు ఇలాంటి స‌మ‌స్య‌లుండ‌వ‌న్నారు. మ‌న విద్యా వ్య‌వ‌స్థ‌లోని లోపాలే ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు మూలం అన్నారు. పిల్ల‌ల‌కు లెక్క‌లూ సైన్సూ నేర్పిస్తారు గానీ హిందూధ‌ర్మం నేర్పించ‌ర‌ని విమ‌ర్శించారు. న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ విష‌య‌మై మాట్లాడుతూ కోర్టు ప‌రిధిలో ఉన్న అంశ‌మ‌న్నారు.

ఇక్కడితో క‌త్తి, ప‌రిపూర్ణానంద వివాదం కొలిక్కి వ‌చ్చిన‌ట్టే భావించ‌వ‌చ్చు. మూడు రోజుల క్రితం క‌త్తిపై ఒంటికాలిపై లేచిన స్వామీజీ గొంతు సవరించుకుని రాముడిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన క‌త్తిని రామాయ‌ణాన్ని ర‌చించిన వాల్మీకితో పోల్చేసారు. మరోవైపు ప‌రిపూర్ణానంద న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ‌ను క‌త్తి మహేష్ కూడా వ్య‌తిరేకించారు. సున్నిత‌మైన అంశాల‌ను తెగేదాకా లాగ‌కుండా స‌మ‌స్య‌ను పెద్ద‌ది కాకుండా ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారేమో..