సవాల్ స్వీకరించాడు ..మరో సవాల్ విసిరాడు

220
నిన్న ఒంగోలులోని కందుకూరు బహిరంగ సభ వేదికగా ప్రతిపక్షనేత జగన్, జనాసేన అధినేత పవన్ కళ్యాణ్ పై  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. పవన్ పై విరుచుకు పడటమే కాదు, ఎన్‌డీయే ప్రభుత్వం పై లోక్ సభ లో అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించి ఆంధ్ర రాజకీయాల్లో కుదుపు తెచ్చారు. ఈ నేపధ్యంలో జగన్ కి పవన్ దీటైన ప్రతి సవాల్ విసిరాడు.
జగన్ నిన్న మాట్లాడుతూ, వైకాపా లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్దంగా ఉందని, దీనికి 54 మంది ఎంపీల మద్దతు కావాలని, మరి పవన్ కళ్యాణ్ – తెదేపా ఎంపీల మద్దతు ఇప్పించే బాధ్యత తీసుకుంటాడా అని సవాల్ చేసాడు. ఆపై రోజా తదితరులంతా పవన్ తక్షణమే స్పందించాలంటూ గళమెత్తారు. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ అనూహ్యంగా జగన్ సవాల్ కి ప్రతి సవాల్ విసిరారు ముందుగా జగన్ సవాల్ ని తాను స్వీకరిస్తున్నానని ప్రకటించిన పవన్, అవిశ్వాస తీర్మానానికి కావలసింది 54 మంది కాదు 50 మంది అని సరి చేసారు.
జగన్ పార్టీ గనక అవిశ్వాస తీర్మానం పెడితే, 50 మంది ఎంపీలని సమీకరించడానికి తాను సిద్దమన్నారు. టిడిపి, టీ ఆర్ ఎస్, కమ్యూనిస్ట్, ఎం.ఐ.ఎం, ఆం ఆద్మీ, తదితర పార్టీలతో తానే స్వయంగా మాట్లాడి మద్దతు కూడగడతానని అన్నారు. జగన్ కి దమ్ము, ధైర్యం ఉందని తాను నమ్ముతున్నానని, ఖచ్చితంగా ఆయన అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతి సవాల్ చేసారు. దీంతో డిఫెన్స్ లో పడటం జగన్ వంతైంది. మరి వైసిపి ధైర్యం చేసి అవిశ్వాస తీర్మానం పెడుతుందా? దీనికి వారి ఎంపీలు ఒప్పుకుంటారా? కేసులకి వెరవకుండా కేంద్రం పై అవిశ్వాసం పెట్టే సాహసం జగన్ చేస్తారా.? చూడాలి.