జనసేనకు భయపడే ఎన్నికలు పెట్టలేదట

77

పోరాటయాత్రలో బాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ సర్పంచ్ లతో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల్లో జనసేన పాతుకుపోతుందనే ఎన్నికలు నిర్వహించలేదని   అన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని సీఎం చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. లోకేష్ కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేరని  జోస్యం చెప్పారు. రాజకీయవ్యవస్థ ముఖ్యమంత్రుల పిల్లలకు ఒక అలంకారం. ఆ అలంకారాన్ని కొనసాగించాలని భావిస్తున్నారని విమర్శించారు. సీఎం పదవి వారసత్వమని జగన్‌ భావిస్తున్నారా? అని వైకాపా అధినేతపైనా విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల నిర్వాసితులకు సరైన న్యాయం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేసారు.

చింతమనేనిపై పవన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసారు. చింతమనేని వీధుల్లో గాలికి లేచే ఆకురౌడీ అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తులను వెనకేసుకొస్తారనుకుంటే సీఎంకు సపోర్ట్ చేసే వాడిని కాదన్నారు. విప్ పదవి నుంచి చింతమనేనిని తొలగిస్తారా? లేదా? ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లేఖ రాయమంటారా? అని పవన్ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. కౌలురైతులకు అండగా ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

పవన్ బస చేసిన ప్రాంతానికి తెలంగాణకు చెందిన కొంత మంది జనసేన కార్యకర్తలు వచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నదానిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుందామని సర్దిచెప్పారు. షెడ్యూల్ వచ్చినా పవన్ పోటీ చేయాలా వద్దా అనే ఆలోచిస్తున్నారు.