కేంద్రం, రాష్ట్రాల మధ్య లెక్కలు తేల్చుతారట

66
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కేంద్ర బ‌డ్జెట్ కేటాయింపుల‌తో పాటు, ఇంత‌వ‌ర‌కూ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చామంటున్న నిధుల‌కు సంబంధించిన అంశాల‌పై చర్చిన్చుకోవటానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్, మాజీ పార్ల‌మెంటు స‌భ్యుడు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. చర్చల అనంతరం మీడియాతో ప‌వ‌న్ మాట్లాడారు. ఆంధ్రాకు సంబంధించి కేంద్రంలో భాజ‌పా స‌ర్కారు, రాష్ట్రంలోని తెదేపా స‌ర్కారు ప‌ర‌స్ప‌ర విరుద్ధంగా మాట్లాడుతున్నాయన్నారు.
ఈ లెక్క‌ల విష‌యంలో ప్ర‌జలంద‌రికీ గంద‌ర‌గోళం ఉన్న‌ట్టుగానే, త‌న‌కూ ఉంద‌న్నారు. తెదేపా, భాజ‌పాలు ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయ‌లేన‌ప్పుడు ప్ర‌శ్నించాల్సిన అవ‌స‌రం ఖచ్చితంగా ఉంటుంద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఎంతైతే నిధులు ఇచ్చింద‌ని అంటున్నారో ఆ లెక్క‌లు ద‌య‌చేసి త‌న‌కు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేసారు. అలాగే, కేంద్రం నుంచి రాష్ట్రానికి వ‌చ్చిన‌వాటి వివ‌రాల‌ను కూడా ఇవ్వాల్సిందిగా రాష్ట్ర నేత‌ల్ని కోరారు. ఈ రెండు లెక్క‌ల్నీ తాను క‌మిటీకి పంపిస్తాన‌నీ, కొంత‌మంది మేధావులూ ఆర్థిక రంగ నిపుణుల‌తో ఏర్పాటు కానున్న వాస్త‌వాల నిర్ధార‌ణ క‌మిటీ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాన‌ని ప‌వ‌న్ చెప్పారు. ఈ వివ‌రాల‌ను క‌మిటీకి పంపితే అస‌లు లెక్క‌లు తేలుతాయ‌న్నారు. ఇద్ద‌రూ రైట్ అయితే అస‌లు గొడ‌వ ఉండ‌ద‌నీ, ఇద్ద‌రూ త‌ప్పు అయినా కూడా గొడ‌వ ఉండ‌ద‌నీ, కానీ ఒక‌రిది ఖచ్చితంగా త‌ప్పుందని ప‌వ‌న్ అన్నారు. తాను కోరుతున్నట్టుగా 2014 నుంచి ప‌ద్దుల వివ‌రాలను ఈ నెల 15లోగా ఇవ్వాల‌ని కోరారు.
ఉండ‌వ‌ల్లి మాట్లాడుతూ ప‌వ‌న్ తో జ‌రిగిన భేటీలో ఎక్క‌డా రాజ‌కీయాల ప్ర‌స్థావ‌న లేక‌పోవ‌డం త‌న‌కు న‌చ్చింద‌న్నారు. అస‌లైన పాలిటిక్స్ ప‌వ‌న్ ప్రారంభించార‌న్నారు. ఇన్నాళ్ళూ పవన్ ప్రశ్నించడం ఒకెత్తూ, ఈ అంశంపై ప్రశ్నించబోతుండటం మరో ఎత్తు అన్నారు. ఓవ‌రాల్ గా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య ఓ పెద్ద‌న్న పాత్ర పోషించేందుకు ఈ క‌మిటీ సిద్ధ‌మౌతోంది. అయితే, ఇక్క‌డ ప్ర‌శ్న ఏంటంటే ఈ క‌మిటీని కేంద్రంగానీ, రాష్ట్రంగానీ సీరియ‌స్ గా తీసుకునే ప‌రిస్థితి ఉంటుందా..?
ప్రజల కోణంలో ఆలోచించి, ఇవ్వాల్సిన అవసరమే ఉందనుకున్నా సమాచారం వెబ్ సైట్లలో చూసుమంటారేమో. లెక్క‌లు విష‌యానికొస్తే ప‌వ‌న్ చెబుతున్నంతా గంద‌ర‌గోళ‌మైతే లేదు. ఆంధ్రాకి కేంద్ర కేటాయింపులతోనే సమస్య గానీ లెక్కలతో కాదు.  కేంద్రం ఏదైతే ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల విడుద‌ల విష‌యంలో అంత మొత్తాన్ని ద‌శ‌ల‌వారీగా విడుద‌ల చేస్తారు. ఆ దశల వారీ కేటాయింపులు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని కేటాయింపులు పెంచాల‌ని తెదేపా స‌ర్కారు పోరాటం చేస్తోంది. దీంతో కేంద్రంలో స్పంద‌న మొదలై త్వ‌ర‌లోనే అన్నీ ఇస్తామ‌ని భ‌రోసా ఇచ్చింది. మరి లెక్క‌ల్లో గంద‌ర‌గోళం ఏమిటో.? ఈ క‌మిటీ కొత్త‌గా తేల్చే లెక్క‌లు ఎలా ఉంటాయో.?