అన్ని కులాల మధ్య ఐక్యత కోరుతున్నారు.. సాధ్యమేనా.!

78

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నుంచి పోరాటయాత్రను కొనసాగించేందుకు భీమవరం చేరుకున్నారు. దీనిలో భాగంగా బీసీ సంఘాల ప్రతినిధులు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. రాజకీయాలపై తన ఆలోచనలను వారికి వివరించారు.

కులవ్యవస్థ గురించి మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో కులాల మధ్య విభజన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసారు. మనం అంతా మనుషులుగా కలసి ఉన్నా కులాలుగా విడిపోయామని నిర్వేదం వ్యక్తం చేసారు. కులాల ఐక్యత అనేది తన ఆశయమని తెలిపిన ఆయన ఆంధ్రప్రదేశ్ మొత్తం తెదేపా అధినేత చంద్రబాబు, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబాల చేతుల్లోనే ఉందన్నారు.

తాను అధికారంల కోసం రాజకీయాల్లో రాలేదన్నారు. ఏదో ఒకటి చేసేసి అధికారం కోసం పాకులాడే వ్యక్తినని చెప్పిన ఆయన  అధికారం కంటే సమస్యలపై పోరాటమే తనకు ముఖ్యమన్నారు. సమస్యలపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేసారు. బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ ‘ఎవరో కొంత మంది చేసిన తప్పులకు బ్రాహ్మణులను అనటం తప్పన్నారు. బ్రాహ్మణులకు భీమా అంశంపై మ్యానిఫెస్టోలో పెట్టేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

రాజకీయ పార్టీ పెట్టడం చాలా కష్టమైన, ఖర్చుతో కూడిన పని అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ జనసేనపై ఓ సామాజికవర్గ ముద్ర పడకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తూ అన్ని వర్గాల ప్రజలనూ కలుపుకుంటూ పోవటం ఆహ్వానించదగ్గ పరిణామమే. మేనిఫెస్టో విడుదలకు ముందు సమాజంలో అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాలతో సమావేశమై ఆలోచనలు పంచుకోవటం మంచి ప్రయత్నమే అని చెప్పాలి.