పవన్ యాత్ర మరో జిల్లాకు చేరుకుంది ..కానీ

196

పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర విజయనగరం జిల్లాకు చేరుకుంది. బొబ్బిలిలో ఒక రోజంతా ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. పోరాట యాత్ర షెడ్యూల్ పై సుదీర్ఘ చర్చలు జరిగాయని జనసేన నేతలు చెబుతున్నారు. జిల్లాలోకి పోరాటయాత్ర వచ్చే వరకూ రూట్ మ్యాప్ ఖరారు చేసుకోలేదా.?అని రాజకీయవర్గాలు సందేహిస్తున్నాయి.

పార్టీలో పెద్ద నేతలుగా చెప్పుకున్న వారంతా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసి పవన్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చేయలేరా.? అని  జనసేన కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. శ్రీకాకుళం జిల్లాలో పోరాటయాత్ర ప్రారంభిస్తున్న ముందు రోజు వరకూ.. జనసేనలో ఓ మాదిరి నేతలుగా చెప్పుకున్న వారెవరికీ షెడ్యూల్ తెలియదు. ఆయన ఏ రోజు ఏ నియోజకవర్గంలో యాత్ర చేస్తారన్నదానిపై అంతకు ముందు రోజు మాత్రమే క్లారిటీ వస్తుందని జనసేనలో పై స్థాయి వారు చెప్తున్నారు.

ఉత్తరాంధ్రలో ఉన్న మూడు జిల్లాల్లో 45 రోజులు పర్యటన షెడ్యూల్ ఉంటుందని జనసేన వర్గాలు మీడియాకు చెప్పాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు రోజులు పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని చెప్పారు. కానీ శ్రీకాకుళం యాత్ర మొత్తాన్ని ఆరు రోజుల్లో పూర్తి చేసారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఒక్క రోజు దీక్ష చేసారు. ఇవన్నీ అప్పటికప్పుడు అనుకున్నవే. ఒక్కటీ ప్లాన్ ప్రకారం జరగలేదు.

శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ చెప్పుకోవడానికి ఉద్దానం సమస్య ఉంది. ప్రతి సభలోనూ ఉద్దానం విషయాన్ని ప్రస్తావించారు. అది తప్పితే మిగిలినదంతా తెలుగుదేశం పార్టీపైన, చంద్రబాబుపై ఆరోపణలే.  ఇంతవరకూ విజయనగరం జిల్లాలో విషయంలో పవన్ చేసింది ఏమీ లేదు. ఒక్క సమస్యపైనా పోరాడింది లేదు. ఇలాంటి తరుణంలో జిల్లా మొత్తంలో జరిగే బహిరంగ సభల్లో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీలే లక్ష్యంగా మాట్లాడతారా.? లేదా ఏదైనా సమస్యను ఎత్తుకుంటారా.? చూడాలి.