పవన్ కళ్యాణ్ ది భజనసేనేనా?

603

పవన్ కళ్యాణ్ నటించిన “అత్తారింటికి దారేది” సినిమాలో ఒక సన్నివేశం ఉన్నది. పదిలక్షల కట్టలు కలిగిన సూట్కేస్ ను ఆలీకి ఇస్తాడు. అలీ దాన్ని రకరకాల తాళంచేతులతో తెరవడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు పవన్ “పది లక్షలు ఉన్న కేసును ఇస్తే ఇలా సుత్తి తీసుకుని పగలగొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ, తాళంచేతులతో తియ్యడానికి ప్రయత్నించకూడదు” అని సుత్తితో సూట్ కేసు ను బద్దలు కొడతాడు. ఆలీ ఖంగు తింటాడు. “నీకు అదృష్టం లేదు. ఒక కట్ట మాత్రమే నీకు ప్రాప్తం ఉంది అని ఒక కట్టను ఆలీకి ఇచ్చి మిగిలింది తాను తీసుకుంటాడు.

పవన్ కళ్యాణ్ కు అభిమానులు పవర్ స్టార్ అని బిరుదు ఇచ్చారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా వేలాదిమంది అభిమానులు తరలివస్తారు. ఆయన నోటినుంచి వెలువడే ప్రతి డైలాగుకు చప్పట్లు కొడతారు. ఈలలు వేస్తారు. అంతటి అభిమానం చూరగొన్న పవన్ లాంటి ప్రజాభిమానం కలిగిన నాయకుడు ఎన్నికలు వస్తే ఏమి చెయ్యాలి?

పార్టీ పెట్టి నాలుగేళ్లు దాటింది. సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. పోటీ చెయ్యలేదు. తెలుగుదేశం, బీజేపీ కి మద్దతు ప్రకటించారు. ఆ తరువాత తెలంగాణాలో అనేక ఉపఎన్నికలు వచ్చాయి. పోటీ అన్న మాటేలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నంద్యాలకు ఉపఎన్నిక వచ్చింది. పోటీకి దూరంగా ఉన్నారు. దేనికి? ఒక నూతన పార్టీని స్థాపించినప్పుడు ఎన్నికల బరిలో దిగకుండా, అధికారపార్టీకి మద్దతు ప్రకటించడం పార్టీకి ఆత్మహత్యాసదృశం కాదా?

అసలు పవన్ ఉద్దేశ్యం ఏమిటి? రాబోయే ఎన్నికలలో అయినా పోటీచేసే ఉద్దేశ్యం ఉన్నదా? లేక తెలుగుదేశం, బీజేపీ లకు తోకగా మిగిలిపొదలచుకున్నారా? ప్రజాభిమానం సున్నా అయినప్పటికీ, లోక్ సత్తా పార్టీ కనీసం ఎన్నికలలో పోటీ చేసింది. పార్టీని పెట్టుకుని నాలుగేళ్లు దాటినా ఎన్నికలబరిలో దిగకపోవడానికి కారణం ఏమిటి? ఓట్లు రావు అని భయమా? జగన్ మీద ఉన్నట్లు పవన్ మీద కేసులు లేవు. ఆయనమీద ఎలాంటి నేరారోపణలు లేవు. తన మీద కక్ష సాధిస్తారన్న జంకు అవసరం లేదు. మరి పోటీకి దూరంగా ఉండటానికి కనీసం కారణాలైనా ప్రజలకు చెప్పాలి కదా?

Pawan Kalyana Janasena is telugudesam bhanasena?పవన్ కళ్యాణ్ ది భజనసేనేనా?

జనసేన అనబడే బ్రహ్మపదార్ధం లో ఇంతవరకు కార్యవర్గం లేదు. ఆ పార్టీకి ఇంతవరకూ నాయకులు కానీ, కార్యకర్తలు లేరు. గ్రామాల్లో ఆ పార్టీ బాధ్యులు ఎవరో తెలియదు. పవన్ తరువాత ఆ పార్టీలో మరో నాయకుడు ఎవరో తెలియదు. జనసేన తరపున ప్రజా ఉద్యమాలు లేవు. ప్రజాసమస్యలపై పోరాటాలు లేవు. చంద్రబాబు చేస్తున్న తప్పులు కోకొల్లలు. ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉన్నది. అయినా పవన్ నుంచి స్పందనే లేదు. ప్రజలు విమర్శించినపుడు మొహమాటం కొద్దీ ఆ వైపు వెళ్లడం, బాధితులతో మొక్కుబడిగా మాట్లాడటం, చివరకు చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటన ఇచ్చేసి వెళ్లిపోవడం… గత మూడేళ్ళుగా పవన్ వ్యవహరిస్తున్న తీరు ఇది.

ఒక రాజకీయ పార్టీగా నిలదొక్కుకోవడానికి పవన్ ఏమాత్రం ప్రయత్నాలు చెయ్యడం లేదు అని చెప్పుకోవాల్సి వస్తున్నది. పవన్ మీద కోటి అసలు పెట్టుకున్న కాపు నేతలు, కాపు కులస్తులు ఒకదశలో ముద్రగడను కాదని పవన్ కు నాయకత్వం ఇవ్వాలని భావించారు. కానీ వారి ఆశలు వమ్మయ్యాయి. చంద్రబాబు ప్రయోజనాలకోసమే పవన్ పాటు పడుతున్నారని కాపులు కూడా గ్రహించారు. దాంతో ముద్రగడ మరింత బలవంతుడు అయ్యారు.

పవన్ తన అవివేకం తో పంచతంత్రం లోని కుక్కుటాన్ని గుర్తుకు తెస్తున్నారు. అటు జంతువులకు కాక, ఇటు పక్షులకు కాక ఉభయభ్రష్టుత్వం పొందిన కోడి కథ పంచతంత్రంలో ప్రసిద్ధము. చివరకు పవన్ కు ఆ గతి పడుతుంది అని చెప్పడానికి బాధగానే ఉన్నది.

– ఇలపావులూరి మురళీ మోహన రావు