వచ్చేసింది కానీ ..ఎన్నో సందేహాలున్నాయి

341

దేశంలో ఇప్పుడు అంద‌రి దృష్టీ జీఎస్టీపైనే. అంతా ఇదే హ‌డావుడి. జీఎస్టీపై ప్ర‌జ‌ల్లో ర‌క‌ర‌కాల ఆందోళ‌న‌లూ అభిప్రాయాలూ అనుమానాలు ఉన్నాయి. వ‌స్తు సేవా ప‌న్ను (జీఎస్టీ)కి ఒక‌ట్రెండు రాజ‌కీయ పార్టీలు మిన‌హా దాదాపు అన్ని పార్టీలూ మ‌ద్ద‌తు ప‌లికాయి. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి నుంచీ జీఎస్టీ అమ‌ల్లోకి వచ్చింది. భార‌తదేశ చ‌రిత్ర‌లో ఈ ప‌న్ను విధానాన్ని ఓ గొప్ప సంస్క‌ర‌ణ‌గా భాజ‌పా స‌ర్కారు చెప్పుకుంటోంది. అయితే సామాన్యుల‌తోపాటు చాలా వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో కొన్ని అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి.

గ‌తంలో నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ఏ తీరున అమలు చేసిందో అనేది మ‌ర‌చిపోలేం! స‌రైన స‌న్న‌ద్ధ‌త లేకుండా, త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌పై అంచ‌నా, అవ‌గాహ‌న‌, ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు లాంటివి ఏవీ లేకుండా ఇబ్బడిముబ్బ‌డిగా పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసారు. నిజం చెప్పాలంటే ఆ ప్ర‌భావం నుంచీ ఇప్ప‌టికీ దేశం పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ఆ నిర్ణ‌యం ద్వారా దేశంలో న‌ల్ల‌ధ‌నాన్ని ఏ మేర‌కు క‌ట్ట‌డి చేసారో భాజ‌పా స‌ర్కారుకే తెలియ‌లేదు. జీఎస్టీ విష‌యంలో కూడా స‌రైన స‌న్న‌ద్ధ‌తతో కేంద్రం ఉందా అనే అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి. ఎందుకంటే, జీఎస్టీ అమ‌లుపై అన్ని వ‌ర్గాల నుంచీ ప‌రిపూర్ణ సంసిద్ధ‌త క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా వ్యాపార వ‌ర్గాల నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మౌతోంది. జీఎస్టీ త‌రువాత ఉండబోతున్న ప‌న్ను రేట్ల‌పై నిర‌స‌న‌లు వ‌స్తున్నాయి.

జీఎస్టీకి అన్ని వ‌ర్గాల స‌హ‌కారం ల‌భించినా వ్య‌వ‌స్థ అంతా ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం సెట్ కావ‌డానికి క‌నీసం ఆర్నెలు స‌మ‌యం ప‌డుతుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆ త‌రువాత‌, కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదాయం గ‌ణ‌నీయంగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే, జీఎస్టీ అమ‌ల్లోకి వ‌చ్చాక కొన్ని మార్పులూ చేర్పుల‌కు కేంద్రం సిద్ధంగా ఉండాలి. ప్ర‌జ‌లు, వ్యాపార వ‌ర్గాల నుంచీ వివిధ ప‌న్నుల‌పై నిర‌స‌న వ్య‌క్త‌మ‌య్యే ఛాన్సులైతే ఉన్నాయి. ఫీడ్ బ్యాక్ ఆధారంగా ప‌న్నుల విధానంలో మార్పుల‌కు జీఎస్టీ కౌన్సిల్ రెడీగా ఉండాలి. జీఎస్టీపై ప్ర‌జ‌ల్లో ఉన్న గంద‌ర‌గోళం తీర్చే ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం మాదిరిగా త‌త్త‌ర‌పాటు ప‌డితే ప్ర‌జ‌ల నుంచీ తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.