‘పెథాయ్’ ముప్పు తప్పింది ..కోస్తాకు స్వల్ప నష్టం

345

విధ్వసం సృష్టిస్తుందని భయపడ్డ ‘పెథాయ్’ తుపాను నెమ్మదించి తీరం దాటింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరం తాకినట్లు వాతావరణశాఖ ప్రకటించారు.

ఈ తుపాను ప్రభావం ఏడు జిల్లాలపై పడిన కారణంగా పలు రైళ్ళు రద్దు కాగా విమాన రాకపోకలపై కూడా ప్రభావం పడింది. విశాఖకు రావాల్సిన 14 విమానాలను రద్దు చేయగా దాదాపు 750 మంది ప్రయాణీకులు విమానాశ్రయంలోనే పడిగాపులు గాస్తున్నారు. తుపాను దృష్ట్యా తీరప్రాంత జిల్లాల్లో పాఠశాలకు సెలవు ప్రకటించారు. తుపాను బీభత్సం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంది. ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో అరటి తోటలు నేలకొరిగాయి.

మధ్యాహ్నం 2.30 గంటలకు కాకినాడ–యానాం మధ్య తీరం దాటిన తుపాను ఆ తర్వాత దిశను మార్చుకుని సముద్రంలోకి చేరుకుంది. రాత్రి 7.30–8.30 మధ్యలో తుని సమీపంలో మరోసారి తీరం దాటింది. తరువాత బలహీనపడి ఒడిశా వైపు పయనించింది. చలిగాలుల తీవ్రతను తట్టుకోలేక తుపాను ప్రభావిత శ్రీకాకుళం, విశాఖ, తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 26మంది మృత్యువాత పడ్డారు.

తీరం దాటే ముందు కురిసిన కుండపోత వర్షానికి, ఈదురుగాలులకు కోస్తాంధ్ర జిల్లాలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, సెల్‌టవర్లు నేలకొరిగాయి. చెట్లు విరిగిపడి పలు వాహనాలు, ఇళ్ళు ధ్వంసమయ్యాయి. తుపాను ప్రభావం ఊహించినదానికంటే తక్కువగా ఉందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో ప్రకటించారు.
భారీ వర్షాలవల్ల తుపాను ప్రభావిత జిల్లాల్లో వరి, అరటి, మొక్కజొన్న, పత్తి, పొగాకు, మిర్చి, వేరుశనగ తదితర పంటలు దెబ్బతిన్నాయి.

సోమవారం సాయంత్రం వరకూ అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం మొత్తం 10,866 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. మరో 1,211 హెక్టార్ల వరి నీట మునిగి ఉంది. 5,857 హెక్టార్లలో వరి పడిపోయింది. 14,982 హెక్టార్లలో కోత కోసి పొలంపైనే ఉంది. ఇవి కాకుండా 596 హెక్టార్లలో పొగాకు దెబ్బతింది. 3,988 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతింది. రాజమండ్రి, విశాఖ ఎయిర్‌పోర్టుల్లో అనుకూలించని వాతావరణం కారణంగా సీఎం ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు అనుమతి దొరకలేదు. తుపాను ప్రభావిత ప్రాంతాల్ని మంగళవారం ముఖ్యమంత్రి పరిసీలించే అవకాశం ఉంది.