రివ్యూ : ఇది అభిమానుల ‘పేట’

374

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పేట’. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఈరోజు రిలీజయ్యింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథేమంటే..

కాళీ (రజనీకాంత్) హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తుంటాడు. ప్రాణిక్‌ హీలర్‌గా పనిచేసే డాక్టర్‌ (సిమ్రన్‌)తో పరిచయం అవుతుంది.  సరదాగా గడిచిపోతున్న సమయంలో కాళీకి లోకల్‌ గూండాతో గొడవ అవుతుంది. ఆ గొడవ కారణంగా ‘కాళీ’ అసలు పేరు పేట అని, అతను ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చాడని తెలుస్తోంది. అసలు పేట, కాళీగా ఎందుకు మారాడు..? ఎక్క‌డో ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో ఉంటున్న సింహాచ‌లం (న‌వాజుద్దీన్ సిద్దిఖీ)కీ త‌న కొడుకు జిత్తు (విజ‌య్ సేతుప‌తి)కీ ఉన్న సంబంధం ఏమిటి? అనేదే ‘పేట’ క‌థ‌.

ఎలా ఉందంటే..

హీరో వేరే ప్రాంతంలో తన ఐడెంటినీ దాచి బతుకుతుండటం, అతని వెనక ఒక భారీ ఫ్లాష్ బ్యాక్‌ ఉండటం అనేది చాలా రొటీన్ కాన్సెప్ట్. రజనీ గతంలో ఇలాంటి సినిమాలు చేసాడు. మరోసారి అదే ఫార్ములాకు రజనీ స్టైల్‌ను జోడించి తెరకెక్కించారు. తొలి భాగానికి ఇంట్రస్టింగ్‌ ట్విస్ట్‌లున్నా ద్వితియార్థంలో తడబడ్డారు. రజనీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకున్న కథలో పెద్దగా కొత్తదనమేమీ లేదు. కార్తీక్ సుబ్బ‌రాజు గత సినిమాల్లో కనిపించే ‘షార్ప్ నెస్’ ఈ సినిమాలో ఎక్క‌డా క‌నిపించ‌దు. ప్ర‌తీ స‌న్నివేశం నిదానంగానే సాగుతుంది. ద్వితీయార్థంలో 1980ల నాటి క‌థ‌ వస్తుంది. త‌మిళ వాస‌న‌తో ఉన్న ఫ్లాష్ బ్యాక్ లో ఎక్కడా కొత్తదనం కనిపించదు.

ర‌జ‌నీలాంటి స్టార్ దొరికినా దర్శకుడు స‌రిగా వాడుకోలేద‌నిపిస్తుంది. ‘ర‌జ‌నీ’ అంటే ఒక ఫైర్.. ఆ ఫైర్‌ని వాడుకునే తెలివితేట‌లు ద‌ర్శ‌కుడికి ఉండాలి. లేదంటే అది ‘పేట’ అవుతుంది.

ఎవరెలా..

రజనీకాంత్ మరోసారి స్టైలిష్‌, మాస్‌ యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. ఇద్దరు హీరోయిన్స్‌ ఉన్నా ఎవరికీ పెద్దగా ప్రాదాన్యం లేదు. విజయ్‌ సేతుపతి, నవాజుద్ధిన్‌ సిద్ధిఖీ లాంటి నటులున్నా పాత్రలు గుర్తుండిపోయేలా లేవు. సినిమా అంతా రజనీ వన్‌మేన్‌ షోలా సాగుతుంది. శశికుమార్‌, బాబీ సింహా, మేఘా ఆకాష్‌, నాగ్‌ తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

ఫైనల్ గా..

‘మాస్’ ..మాస్ అంటూ తుస్ అనిపించారు