‘మోదీ’ గారు అత్యంత సామాన్యులు.!

62
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మాట‌కారిత‌న‌మే గుజ‌రాత్ నుంచి ఆయ‌న్ని ఢిల్లీకి చేర్చింది. అయితే ఇప్పుడు అదే మాట‌కారిత‌నం  ఆయ‌నపై వ్య‌తిరేక‌త పెంచ‌డానికీ కార‌ణ‌మవుతోంది. ఎలాంటి సంద‌ర్భంలో నైనా ఆయన ప్ర‌జ‌ల‌ను ఇంప్రెస్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. తాజాగా ఆయన మరోసారి తాను అత్యంత సామాన్యుడిని అని చాటిచెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.
శుక్ర‌వారం నాడు అనూహ్యంగా ఆయ‌న ఢిల్లీలో మెట్రో రైలు ఎక్కేసి సెల్ఫీల‌కు ఫోజులిస్తూ జనాలకు షాకిచ్చారు. సాధార‌ణ ప్ర‌యాణికుడి మాదిరిగా ప్ర‌యాణించారు.మరోవైపు  దేశాన్ని కుదిపేస్తున్న రెండు అత్యాచారం ఘ‌ట‌న‌ల‌పై స్పందించారు. ‘ఇలాంటి ఘ‌ట‌న‌లు నాగ‌రిక స‌మాచారంలో జ‌ర‌గాల్సినవి కావ‌న్నారు. మ‌న స‌మాజం సిగ్గుప‌డాల్సిన ప‌రిస్థితి ఇద‌నీ, తాను దేశానికి హామీ ఇస్తున్నాన‌నీ, మ‌న ఆడ‌బిడ్డ‌ల‌కు న్యాయం జ‌రిగేలా కృషి చేసి, దోషులు ఎంత‌టివారైనా శిక్ష ప‌డేలా చేస్తాన‌’ని మాటిచ్చారు. ఆ త‌రువాత‌, ద‌ళితులు అణ‌గారిన వ‌ర్గాల కేసుల‌ను త్వ‌ర‌తగ‌తిన ద‌ర్యాప్తు చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల‌ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.
అంబేద్క‌ర్ ఆశ‌యాల సాధ‌న‌కు తాము కృషిచేసినంత‌గా గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్న‌డూ ప్ర‌య‌త్నించ‌లేద‌ని ఆరోపించారు. తాను నిరుపేద‌, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన కుటుంబంలో జ‌న్మించి ఉండ‌క‌పోతే అంబేద్క‌ర్ ఆశ‌యాలూ సిద్ధాంతాలూ త‌న‌కి తెలిసి ఉండేవి కావేమో అన్నారు. తాను నిరుపేద కుటుంబంలో పుట్టాను కాబ‌ట్టి, వారి క‌ష్టాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోగ‌ల‌నని చెప్పారు. దేశానికి అంబేద్క‌ర్ చేసిన చేసిన సేవ‌ల్ని చెరిపేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నించింద‌నీ, ఆయ‌న పేరును చ‌రిత్ర‌లో లేకుండా చేయాల‌ని అనుకుంద‌న్నారు.
నిరుపేద కుటుంబం నుంచి వ‌చ్చాన‌నీ, టీ అమ్ముకుంటూ జీవితం ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగాన‌నీ ఇటీవల ఎక్కువ సందర్భాల్లో మాట్లాడుతున్నారు. విప‌క్షాల‌న్నీ ఏక‌మై త‌న‌ను ఒంట‌రివాడిని చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయంటూ ఒక‌రోజు నిర‌హార దీక్ష‌ చేసారు. దేశ‌వ్యాప్తంగా బ‌ల‌హీన వ‌ర్గాల నుంచి మొద‌లైన వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొనే దిశగా ముందడుగు వేస్తూనే మరోవైపు సింప‌థీ కోసం ఆరాట‌ప‌డుతున్నారు.