రివ్యూ : విషయం ఉన్నా ‘సవ్యసాచి’ కాలేకపోయాడు

339

అక్కినేని నట వారసుల్లో ఒకడు నాగచైతన్య మొదటి సినిమాతో చతికిలపడినా తరువాత తరువాత లవర్‌ బాయ్‌గా హిట్లు సొంతం చేసుకున్నాడు. యాక్షన్‌ హీరోగా చేసిన ప్రతీ సారి ఫెయిల్‌ అయిన చైతూ మరోసారి యాక్షన్ సినిమాతో వచ్చాడు. చందు మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’గా వచ్చాడు. సినిమా టీజర్ విడుదలైనప్పటి నుండి విభిన్న కధాంశంతో తెరకెక్కిన సినిమాగా ప్రచారం చేసి అంచనాలను పెంచారు. ఈ సినిమా అయినా చైతూకు యాక్షన్‌ హీరోగా సక్సెస్‌ ఇచ్చిందా.? చూద్దాం.

కథేమంటే..

కులు వ్యాలీలో బస్సు ప్రమాదం నుండి యాడ్ ఫిలిం డైరెక్టరు విక్రమ్‌ ఆదిత్య (నాగచైతన్య) ప్రాణాలతో బయటపడతాడు. విక్రమ్‌ ఆదిత్య వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రమ్‌తో పుట్టిన వ్యక్తి కావటంతో ఆనందం వచ్చినా కోపం వచ్చినా తన ఎడమ చేయి అతని కంట్రోల్‌ లో ఉండదు. త‌న‌కంటూ ఓ ఆలోచ‌న, ఇష్టం ఉంటాయి. చిత్ర (నిధి అగ‌ర్వాల్‌)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు విక్ర‌మ్‌. త‌ను కూడా ఇష్ట‌ప‌డే స‌మ‌యానికి చెప్ప‌డు. ఆరేళ్ళకు క‌లుస్తాడు. వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించే స‌మ‌యానికి విక్రమ్‌ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి బావ, మహాలక్ష్మి చనిపోతారు. అక్క (భూమిక) హాస్పిటల్‌లో ఉంటుంది. ప్రమాదంలో అక్క కూతురు మహాలక్ష్మి చనిపోలేదని, తన దగ్గరే ఉందని అరుణ్ (మాధవన్) విక్రమ్‌కి ఫోన్‌ చేసి చెప్తాడు. విక్రమ్‌కి అజ్ఞాత వ్యక్తికి మధ్య వైరం ఏంటి..? బస్సు ప్రమాదానికి ఈ కథకు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

వానిషింగ్‌ ట్విన్‌ సిండ్రోమ్‌ అనేది తెలుగుతెరపై డిఫరెంట్ పాయింట్‌. దర్శకుడు చందూ మొండేటి యాక్షన్‌ ఎమోషనల్‌ అంశాలతో మంచి కథను సిద్ధం చేసుకుని కథను తెర మీద ఆవిష్కరించటంలో తడబడ్డాడు. సినిమా ఆసక్తికరంగా మొదలైనా ఫస్ట్‌ హాఫ్‌ అంతా హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలతో నడిపించాడు. హీరో ఎడమ చేతి సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేవు. ప్రీ ఇంట్రర్వెల్‌ వరకు అసలు కథ మొదలు కాదు.

నిజానికి ద్వితీయార్థంలో క‌థానాయ‌కుడు- ప్ర‌తినాయ‌కుడు మ‌ధ్య జ‌రిగే మైండ్ గేమ్‌కీ ఈ వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌కీ ఎలాంటి సంబంధం ఉండ‌దు. సినిమా అంతా కాకుండా అక్క‌డ‌క్క‌డ మాత్రమే ఈ పాయింట్‌ని ద‌ర్శ‌కుడు వాడుకున్నాడు. విశ్రాంతి వ‌ర‌కూ క‌థ అంగుళం కూడా ముందుకు క‌ద‌ల‌దు. క‌థ ఎక్క‌డ మొద‌లైందో, అక్క‌డే ఉంటుంది. క‌థ మొద‌లైన పావుగంట‌కే గ‌మ‌నం తెలియాల‌న్న‌ స్క్రీన్ ప్లే సిద్ధాంతం గంట‌న్న‌ర అయినా కనిపించలేదు. చిత్ర‌ని వ‌దిలి విక్ర‌మ్ ఆరేళ్ళు గ‌డిపేయ‌డానికి, అసలు దూరం రావ‌డానికి స‌రైన లాజిక్ లేదు.

ఇంటర్వెల్‌ తరువాత కథ వేగం అందుకుంటుదనుకున్న సమయంలో మరోసారి కాలేజ్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ బ్రేక్‌ వేస్తుంది. సుభద్రా పరిణయం నాటకం ఆకట్టుకున్నా కథనం ఎమోషనల్‌గా సాగుతున్న సమయంలో వస్తాయి. అరుణ్‌ సమాజంపై, 21 మందిపై ఆ స్థాయిలో ప‌గ పెంచుకోవ‌డానికి బ‌ల‌మైన కారణాలు చూపిస్తే బాగుండేది. హీరో, విల‌న్ ల మ‌ధ్య మైండ్ గేమ్ హీరో, విలన్ల మధ్య జరిగే మైండ్‌ గేమ్‌ ఆకట్టుకుంటుంది. అయితే అలాంటి సన్నివేశాల్లో ఫోన్ల‌తో సవాళ్ళు, బ్లూటూత్ ద్వారా మాట్లాడుకోవ‌డం అనే కాన్సెప్టు నుంచి తెలుగోళ్ళు బయటకి రారేమో.

ఎవరెలా..

సినిమా నాగచైతన్య, మాధవన్‌ల చుట్టూనే తిరుగుతుంది. ఇద్దరూ ఒదిగిపోయి నటించారు. చైతూ ఎడమ చేయి తన మాట వినని పరిస్థితుల్లో ఒక వ్యక్తి పడే ఇబ్బందులను బాగా చూపించాడు. కామెడీ, రొమాన్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌తో పాటు యాక్షన్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. తొలిసారిగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసిన మాధవన్‌ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. సైకో విలన్‌గా మాధవన్‌ నటన, పలికించిన హావ భావాలు సినిమాకు ప్లస్‌ అయ్యాయి. హీరోయిన్‌గా పరిచయం అయిన నిధి కేవలం లవ్‌ స్టోరి, పాటలకే పరిమితమైంది. భూమిక తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్‌, సుదర్శన్‌, సత్య కామెడీతో ఆకట్టుకున్నారు.

ఫైనల్ గా ..

ఒక పాయింట్ చుట్టూ క‌థ అనుకున్నపుడు అదే తీయాలి.’వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌’ అనే పాయింటే తీసుకుని తొలిభాగం ఓ సినిమా, రెండో భాగం మ‌రో సినిమా చూపించారు.