‘కత్తి మహేష్’పై ఆంక్షలు ఆగవా.?

410

హైదరాబాద్ నుంచి బహిష్కరణకు గురైన కత్తి మహేష్ పై ఆంధ్రప్రదేశ్ లోనూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాముడు, సీతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హైదరాబాద్ పోలీసులు ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించి చిత్తూరులో విడిచిపెట్టారు.

కత్తి మహేష్ రెండు రోజుల కిందట పీలేరు నియోజకకవర్గంలో ఉన్న స్వగ్రామంలో మీడియా సమావేశం పెట్టాలనుకున్నారు. ఈ విషయం తెలిసి చిత్తూరు జిల్లా పోలీసులు కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకుని బెంగళూరు తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టారు. కత్తి మహేష్ ను లా అండ్ ఆర్డర్ కారణంగా చూపి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయకపోయినా అదే తరహా ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. కత్తి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడతారన్న ఉద్దేశంతోనే పోలీసులు ఆయనను పీలేరు నుంచి తరలించినట్లు చెబుతున్నారు.

హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణ చేసిన తర్వాత సోషల్ మీడియాలో కత్తి మహేష్ తన అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు.  అయితే రాముడికి సంబంధించిన ఓ భక్తి గీతాన్ని స్వయంగా ఆలపించి సోషల్ మీడియాలో పెట్టారు. దానికి పరిపూర్ణానంద కూడా అభినందించారు. కత్తి మహేష్ ప్రెస్ మీట్లను ప్రసారం చేయడానికి మీడియా సంస్థలు కూడా సిద్ధంగా లేవు. రాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసిన సంస్థకు ఇప్పటికే తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా మీడియా వాచ్ కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కత్తి మహేష్ ప్రెస్ మీట్ పెట్టినా ప్రసారం చేసేందుకు టీవీ ఛానళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో కత్తి అసలు మీడియా ముందుకు రాకుండా రెండు రాష్ట్రాల పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కత్తి మహేష్ కు ఆరు నెలలు పబ్లిసిటీ రాదనుకోవాలా.? ఏదైనా కాలమే చెప్పాలి.