పొన్నాల ‘అలక’ అధిష్టానానికి అర్ధమవుతుందా.?

118

ముందస్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌న్న అంచ‌నాతో తెలంగాణ కాంగ్రెస్ సన్న‌ద్ధ‌మౌతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపధ్యంలో కింది స్థాయిలో నియామ‌కాలను చ‌క‌చ‌కా పూర్తి చేస్తున్నారు. జిల్లాలవారీగా పార్టీ కార్య‌క్ర‌మాల‌పై శ్ర‌ద్ధ పెట్టాలంటూ హ‌డావుడి చేస్తున్నారు.

అయితే విభేదాల‌ను ప‌క్క‌న‌బెట్టి, పార్టీ గెలుపుకోసం సీనియ‌ర్లంతా ఒకేతాటిపై నిల‌వాల‌ని ఇప్ప‌టికే అధిష్టానం ప‌దేప‌దే సూచిస్తున్నా కొంత‌మంది సీనియ‌ర్లు మాత్రం త‌మ ధోర‌ణిని మార్చుకోవ‌డం లేద‌ని వినిపిస్తోంది. ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లాలో జ‌రిగే పార్టీ సాధార‌ణ కార్య‌క్ర‌మాల‌కు పొన్నాల హాజ‌రు కావ‌డం లేద‌ని స‌మాచారం. ఆ మ‌ధ్య కాంగ్రెస్ నిర్వ‌హించిన బ‌స్సుయాత్ర‌లో, ప‌లు ప్రాంతాల్లో నిర్వ‌హించిన స‌భ‌ల్లో ఎక్క‌డా పొన్నాల క‌నిపించ‌లేదు.

ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనర్హ‌త వేటు వ్య‌వ‌హారంపై తెరాస మీద తీవ్ర పోరాట‌మే చేసింది. ఈ స‌మ‌యంలో కూడా పొన్నాల చొర‌వ అంతంత మాత్రంగానే క‌నిపించింది. ఇవ‌న్నీ ఇప్పుడు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయంగా మారుతున్నాయి. ఎందుకంటే, ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లాలో పార్టీ త‌ర‌ఫున పెద్ద దిక్కు ఆయ‌న మాత్ర‌మే. కానీ, ఆయ‌న అసంతృప్తో ఉన్నారు. పార్టీలో ఆయ‌న కోరుకుంటున్న ప్రాధాన్య‌త ఏంట‌నేది కూడా రాష్ట్ర నేత‌ల‌కు తెలియ‌ని వ్య‌వ‌హారం కాదు.

ఎన్నిక‌లు లోపుగానే పార్టీలో త‌న ప్రాధాన్య‌త ఏంట‌నే దానిపై ఒక స్ప‌ష్ట‌మైన హామీ హైక‌మాండ్ నుంచి ఆయ‌న ఆశిస్తున్నార‌నే అభిప్రాయ‌మూ వినిపిస్తోంది. రాహుల్ గాంధీ త్వ‌ర‌లోనే రాష్ట్రానికి రాబోతున్నారు కాబ‌ట్టి, ఆయ‌న రాక సంద‌ర్భంగా త‌న‌ను బుజ్జ‌గించే కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని ఆశిస్తున్నార‌ని అనుకుంటున్నారు. ఏదేమైనా, ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ కాంగ్రెస్ లో ఇలాంటి అల‌క‌లు ఇంకా పెరుగుతాయేమో.?