మరోసారి ఆర్.క్రిష్ణయ్యే కావాలని అడుగుతున్నారట.!

91

తెలంగాణ తెలుగుదేశం పార్టీ  ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బీసీ సంక్షేమ సమితి నేతగానే ఎక్కువ మందికి తెలుసు. గత ఎన్నికల ముందు ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశంలో పార్టీలో చేరిన ఆయనను తెదేపా తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కృష్ణయ్య కొన్ని రోజులు తెదేపాతోనే ఉన్నా రేవంత్ ఎపిసోడ్ తర్వాత తన ఉద్యమాలు తాను చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ సమావేశాలకు రాకపోగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకున్నారు. అక్కడ కాపు రిజర్వేషన్ల బిల్లు ఏపీ ప్రభుత్వం పెడితే బీసీలకు నష్టం లేకుండా కాపులకు అదనంగా రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినా ప్రత్యేకంగా విజయవాడ వచ్చి మరీ విమర్శలు చేసారు.

కొంత మంది సంఘాలతో కలిసి ఉద్యమిస్తారని హెచ్చరికలు జారీ చేసేవారు. ఆయనకు చెప్పలేక చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితి లేక తెదేపా ఆయనను అలా వదిలేసింది. ఆ విమర్శలను భరించింది. ఆ మధ్యలో ఆయన పార్టీ పెడతానని కూడా హడావుడి చేసారు. ముందస్తు ఎన్నికలు వచ్చే సరికి ఆయనకు ఎమ్మెల్యే పదవి గుర్తుకు వచ్చింది. పోయిన పదవి లేకపోతే.. ఇబ్బంది అవుతుందనుకున్నారేమో కానీ.. తాను ఇంకా తెదేపాకి రాజీనామా చేయలేదని ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు.

ఈసారి కూడా శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ ఎల్‌బీ నగర్ నుంచే పోటీ చేయాలన్న ఒత్తిడి ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తల నుంచి వస్తోందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే మరోసారి తెదేపా టికెట్ కోరుతున్నారు. గెలిచిన పార్టీకి ఆయన ఏం సేవ చేసారని పిలిచి మరోసారి టికెట్ ఇస్తారు?