ఏపీకి దగ్గరగా దగ్గరగా అన్నీ చేసారట.!

110

ఆంధ్రాకు భాజ‌పా చేసింది చెప్ప‌మంటే ఆ పార్టీ నాయకురాలు పురందేశ్వ‌రి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాల‌ని అంటున్నారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తెదేపా స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

భాజ‌పా ఏపీకి మరే రాష్ట్రానికీ చేయ‌నంత సాయం చేస్తూ, అభాండాలు మోస్తుందని అన్నారు. విభ‌జ‌న చ‌ట్టంలోని ఉన్న వాటిలో 85 నుంచి 90 శాతం వ‌ర‌కూ ఉన్న హామీలను కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌ర్తించిన అంశం ప్ర‌జ‌లు గుర్తించాల‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి అవుతున్న ప్ర‌తీ పైసా కేంద్రం నుంచే వ‌స్తోంద‌నీ, ఒక‌వేళ కేంద్రం సాయం చేయ‌క‌పోతే పోల‌వ‌రం ప‌నులు జ‌రిగేవా అని ప్రశ్నించారు.

యూసీలను రాష్ట్ర ప్ర‌భుత్వం స‌క్ర‌మంగా ఇవ్వ‌డం లేదు కాబ‌ట్టే, రావాల్సిన నిధులకు కొంతమేర ఇబ్బంది క‌లుగుతోంద‌న్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలో తాత్కాలిక నిర్మాణాలే త‌ప్ప‌, శాశ్వ‌త క‌ట్టడాలేవీ లేవ‌ని విమ‌ర్శించారు. కేంద్రం రూ.15 వంద‌ల కోట్లు మాత్ర‌మే రాజ‌ధాని నిర్మాణానికి ఇచ్చింద‌ని అంటున్నార‌నీ, కానీ ఆ సొమ్ము ఇచ్చింది తాత్కాలిక నిర్మాణాల కోసం కాద‌ని ఆమె చెప్పారు.

ఏపీ హోదాకి భాజ‌పా ఏం చేసిందో చెప్ప‌కుండా, అదే ప్ర‌శ్న‌ను కాంగ్రెస్ ను అడ‌గ‌మనటం ఎంతవరకూ సమంజసమో పురందేశ్వరే చెప్పాలి. విభ‌జ‌న స‌క్ర‌మంగా చేయ‌లేదు కాబ‌ట్టే కాంగ్రెస్ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో ఆంధ్రాలో తుడిచిపెట్టుకుపోయింది. ఏపీకి జ‌రిగిన అన్యాయం నేప‌థ్యంలో ఆ పార్టీకి ప్ర‌జ‌లు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేసారు. గ‌డచిన నాలుగున్న‌రేళ్ళుగా కేంద్రంలో భాజ‌పా అధికారంలో ఉన్నా హోదా ఇస్తాని చెప్పి ఎందుకివ్వలేదో చెప్పాలి కదా.

వాస్తవానికి భాజపా నేతలు ప‌్ర‌తీరోజూ ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒక‌టి చెప్పాల‌నే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారే త‌ప్ప‌ వాస్త‌వాలేంటీ, కేంద్రం నుంచి వ‌చ్చిన ప్ర‌యోజనాలేంటనేది మాట్లాడటం లేదు.