యువరాజు పట్టాభిషేకానికి అంతా సిద్ధం

114

రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అద్యక్ష పీఠం అధిష్టించే ప్రక్రియ దాదాపు పూర్తయిపోయినట్లే. డిసెంబరు 31లోగా పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం తేల్చి చెప్పేసింది. అద్యక్ష పదవి అలంకరించాల్సిందిగా మొన్న ఏడవ తేదీన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆయనను అభ్యర్థించింది. కుమారుడికి పగ్గాలు అప్పగించడం కోసమే ఆరోగ్యం బాగలేకపోయినా అద్యక్ష పీఠాన్ని కాపాడుతూ బాధ్యతలు నెట్టుకొస్తున్న సోనియా గాంధీ ఊపిరి పీల్చుకోవచ్చు.

1885 డిసెంబర్‌ 28న ఆవిర్భవించిన భారత జాతీయ కాంగ్రెస్‌ దేశంలో అతి పెద్ద పురాతన రాజకీయ పార్టీ. కేంద్రంలో నలభై ఏళ్ళ కిందట కాంగ్రెస్‌ గుత్తాధిపత్యం బద్దలైపోయింది. స్వాతంత్య్రానంతరం కొంతకాలం మినహాయిస్తే కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు నెహ్రూ కుటుంబ వారసుల నాయకత్వంలోనే నడిచాయి. నెహ్రూ ఉంగానే ఇందిరాగాంధీ కాంగ్రెస్‌ అద్యక్షురాలైనప్పటికీ ఆయన మరణానంతరం మొదట లాల్‌ బహుదూర్‌ శాస్త్రిని ప్రధానిని చేసి ఆ తర్వాత ఆమెను గద్దెక్కించారు. అయితే తర్వాత ఆమె పనులు పాత మితవాదులకు నచ్చక కాంగ్రెస్‌ చీలిపోయింది.

ఎమర్జన్సీ కాలంలో ఇందిర రెండవ కుమారుడైన సంజయ్ గాంధీ పెత్తనం చలాయించారు. తల్లీ కొడుకులే గాక వారి చుట్టూ చేరిన వారి అకృత్యాలు ప్రజాగ్రహానికి కారణమైనాయి. 1980 తర్వాత ఇందిరాగాంధీ పార్టీ అద్యక్ష బాధ్యతలు కూడా చేపట్టి ద్వంద్వ నాయకత్వ కేంద్రాలు లేకుండా చేసారు. సంజయ్ గాంధీ ప్రమాదంలో మరణించాక రాజీవ్‌గాంధీ రంగ ప్రవేశం చేసి పార్టీ ప్రధాన కార్యదర్శిగా వున్నారు. 1984 అక్టోబరు 31న ఇందిర దారుణ హత్య తర్వాత ప్రధానిగా పార్టీ అద్యక్షుడుగా మారి 1984 చివరలో 400 స్థానాలు గెలిచి కనీవినీ ఎరుగని విజయం సాధించారు. 1991 ఎన్నికల ప్రచారం మధ్యలో రాజీవ్‌ హత్య అనంతరం పివి నరసింహారావు నాయకత్వం, 1997లో సోనియా అద్యక్ష బాధ్యతలు తీసుకుని కొనసాగుతూ వచ్చారు.

పదేళ్ళ పాటు కాంగ్రెస్‌ నాయకత్వంలో కేంద్రంలో పాలన సాగడం సోనియా నాయకత్వాన్ని సఫలం చేసింది. అయితే రాహుల్‌ ప్రత్యక్ష నాయకత్వం చేపట్టడానికి ఎక్కువ కాలం తీసుకోవడమే గాక భిన్న సంకేతాలు ఇస్తూ వచ్చారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్‌ ఎన్నడూ లేనంత తక్కువకు 44 లోక్‌సభ స్థానాలకు పడిపోయింది. ఆ ఓటమిపై రాహుల్‌ మాట్లాడుతూ సరైన నాయకత్వం లేకపోవడం ఈ ఓటమికి కారణమన్నారు. ఒక దశలో చెప్పాపెట్టకుండా మాయమైపోవడం దేశ రాజకీయాల్లోనే ఎరుగని పరిణామం.

ఇప్పుడు కాంగ్రెస్‌ కేవలం ఆరు చిన్న రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో వుంది. ఇలాంటి తరుణంలో నాయకత్వం చేపడుతున్న రాహుల్‌ గాంధీ అస్తిత్వ సవాలునే ఎదుర్కోవలసి ఉంటుంది. గుజరాత్‌ ఎన్నికల ఫలితాలపై అంతగా నమ్మకం లేకపోవడం వల్లనే ముందే రాహుల్‌కు పట్టాభిషేకం పూర్తి చేస్తున్నారు. తర్వాత కర్ణాటక, రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ ఘడ్ వంటి రాస్ట్రాలలోనూ ఎన్నికలు జరుగుతాయి. వీటిలో ఫలితాలే  రాహుల్‌ నాయకత్వానికి సూచికలవుతాయి.