రివ్యూ : క్యారే ..’కబాలి 2.0′

132

ముంబై మురికి వాడల నేపథ్యంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘కాలా’. కబాలితో నిరాశపరిచిన పా.రంజిత్‌ కాలాతో మెప్పించాడా.? చూద్దాం.

కథేమంటే ..

కరికాలా అలియాస్‌ కాలా (రజనీకాంత్‌) ముంబైలోని మురికివాడ ధారావీకి పెద్ద దిక్కు. అక్కడే పుట్టి పెరిగిన కాలా అక్కడి ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటుంటాడు. అయితే ముంబైలో అత్యంత విలువైన ఈ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకునేందుకు రాజకీయనాయకులు ప్రయత్నాలు చేస్తుంటారు. అధికార పార్టీ నాయకుడు హరిదేవ్‌ అభయంకర్‌ అలియాస్‌ హరిదాదా (నానా పటేకర్‌) ఎలాగైన ధారావీని నుంచి ప్రజలను వెళ్ళగొట్టి అక్కడ అపార్ట్‌మెంట్లు నిర్మించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ కాలా హరిదాదా పనులకు అడ్డుతగులుతాడు. అలా హరిదాదా, కాలాల మధ్య మొదలైన యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది..? ఈ పోరాటంలో కాలా ఏం కోల్పోయాడు..? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

ర‌జనీ నుంచి ఆశించేది బ‌ల‌మైన హీరోయిజం. ఆయ‌న క‌ద‌లాల్సిన అవ‌స‌రం లేదు. నిల‌బ‌డి నాలుగు డైలాగులు చెబితే చాలు.   స్టైల్‌, డాన్స్‌, ఫైట్ అన్నీ ర‌జ‌నీ బలాలు. వాటిపై దృష్టి పెట్ట‌కుండా తీసిన సినిమా ‘కాలా’. సినిమా ప్రారంభ‌మైన చాలా సేప‌టి వ‌ర‌కూ ర‌జ‌నీ మాట్లాడ‌డు. అత‌ని చుట్టు ప‌క్క‌న పాత్ర‌లు మాత్రం వీరావేశం చూపిస్తుంటాయి. ‘క్యారే… సెట్టింగా’ అంటూ ర‌జ‌నీ ష‌ర్టు మ‌డ‌తెడట్టగానే థియేట‌ర్లు ఊగిపోయాయ్‌. అయితే ర‌జ‌నీ స్థానంలో వేరే వాళ్ళు వ‌చ్చి ఫైట్ చేసి ర‌జ‌నీ శ్ర‌మ త‌గ్గిస్తారు.

తొలిసగంలో నానా ప‌టేక‌ర్ ర‌జ‌నీ ఇంటికొస్తాడు. ‘ధారావి ఇక నుంచి నాది’ అంటూ బలం చూపించాలనుకున్న నానాతో ‘నా అనుమ‌తి లేకుండా నువ్వు ధారావిలో అడుగుపెట్టొచ్చు. కానీ నాకు చెప్ప‌కుండా ఇక్క‌డ్నుంచి బ‌య‌ట‌కు వెళ్ళలేవు’ అంటాడు ర‌జ‌నీ. ఇలాంటి స‌న్నివేశాలు ఇంకో ఐదారైనా ఉంటే సినిమా మరోలా ఉండేది. ఈ విష‌యంలో రంజిత్ మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యాడు. క‌థానాయ‌కుడి పాత్ర‌కంటే ప్ర‌తినాయ‌కుడి పాత్ర బ‌లంగా ఉండాలి. అప్పుడు హీరోయిజం మ‌రింత ఎలివేట్ అవుతుంది. నానాని స‌వాల్ చేసే స‌న్నివేశం ఈ సినిమాలో ఒక్క‌టంటే ఒక్క‌టి ఉండ‌దు.

మ‌ధ్య‌లో ‘చిట్టెమ్మా..’ అంటూ వచ్చే ఏజ్ ఓల్డ్ ల‌వ్ స్టోరీ క‌థ‌కి అవ‌స‌ర‌మా? అనేది ద‌ర్శ‌కుడు ఆలోచించ‌లేక‌పోయాడు. కాలా తాలుకూ ఫ్లాష్ బ్యాక్‌, ల‌వ్ స్టోరీ ఇవేం సినిమాకి బూస్ట‌ప్‌గా నిల‌వ‌లేక‌పోయాయి. కొన్ని కొన్ని ఎలివేట‌ష‌న్ సీన్లు, షాట్లు, స్లో మోష‌న్ హీరోయిజాలూ మిన‌హాయిస్తే ర‌జ‌నీ ఫ్యాన్స్ పూన‌కంతో ఊగిపోయే సంద‌ర్భాలు క‌నిపించ‌లేదు. వీటికి తోడు ప‌తాక స‌న్నివేశాల్లో క‌న్‌ఫ్యూజన్ ప్రేక్షకులకు బోనస్.

ఎవరెలా..

ర‌జ‌నీకాంత్ లో వేగం, ఛార్మ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. నానా ప‌టేక‌ర్-ర‌జ‌నీకాంత్ రెండూ రెండు సింహాలే. కానీ వాటికి స‌రైన వేట ల‌భించ‌లేదు. ఈశ్వ‌రీరావుకే కొన్ని ఎక్కువ డైలాగులు ద‌క్కాయి. స‌ముద్ర‌ఖ‌నికి మ‌రోసారి మంచి పాత్ర ద‌క్కింది. హ్యూమా అందంగా, బొద్దుగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క‌బాలిని గుర్తు చేస్తుంది. ఒక్క పాటంటే ఒక్క‌టీ ఆక‌ట్టుకునేలా లేదు. ధారావి అనే ప్రాంతాన్ని సృష్టించిన ఆర్ట్ డైరక్టర్ ప‌నిత‌నాన్ని మాత్రం మెచ్చుకోవాలి. పా రంజిత్‌కి ద‌క్కిన అవ‌కాశాన్ని వృథా ప‌ర‌చుకున్నాడు.

ఫైనల్ గా..

క‌థ‌లోంచే హీరోయిజం పుట్టాలనే రంజిత్ సూత్రం మరోసారి ఫెయిలయ్యింది.