రాజ్యసభ చుట్టూ రాజకీయం అల్లుకుంటోందా.!

103

రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ఎన్నిక నిర్వ‌హించడానికి స‌న్న‌ద్ధ‌మౌతున్నారు. ఈనెల 9న ఎన్నిక ప్ర‌క్రియ ఉంటుంద‌ని చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. 8వ తేదీ మ‌ధ్యాహ్నంలోపు నామినేష‌న్లు వేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ప‌ద‌వి కోసం భాజ‌పా నేరుగా పోటీ ప‌డ‌కుండా, ఎన్డీయే మిత్ర‌పక్షాల నుంచి ఒక‌ర్ని బ‌రిలోకి దింపాల‌ని భావిస్తోంది.

జేడీయూ నాయ‌కుడు హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్ ను బ‌రిలోకి దింపే అవ‌కాశాలు స్ప‌ష్టంగా ఉన్నాయి. దీనిపై అధికారికంగా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. ఈ ఎన్నిక‌లో నెగ్గాలంటే 120 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు అవ‌స‌రమౌతారు. ఎన్డీయేతోపాటు అన్నాడీఎంకే స‌భ్యుల్ని క‌లుపుకున్నా కూడా 106 మంది మ‌ద్ద‌తు మాత్ర‌మే క‌నిపిస్తోంది. అయితే, ప్ర‌తిప‌క్షాల్లో కూడా ఎన్డీయేకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించేవారు కొంత‌మంది ఉండొచ్చు.

ఈ నేపధ్యంలో సొంతంగా భాజ‌పా అభ్య‌ర్థిని బ‌రిలోకి దించ‌డం లేదు. మరోవైపు విప‌క్షాల నుంచి పోటీ త‌ప్ప‌ద‌నే అనిపిస్తోంది. అయితే అభ్య‌ర్థి ఎవ‌రనేది తేలాల్సి ఉంది. విప‌క్షాల‌న్నీ ఏక‌మైతే ఎన్డీయే అభ్య‌ర్థిపై గెలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.  ఎన్డీయేతో పోల్చుకుంటే ప‌దిమంది స‌భ్యులు ఎక్కువ‌గానే ఉన్నారు. ఒకర‌కంగా చూసుకుంటే ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త‌కు రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ఎన్నిక మ‌రో వేదిక‌గా మారే అవ‌కాశం ఉంది.

కర్ణాటక ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నాయ‌కులు ఒకే వేదిక‌పైకి వ‌స్తే వారి మధ్య స‌యోధ్య సాధ్యం కాద‌ని భాజ‌పా నేత‌లే విమ‌ర్శించారు. అయితే, రాజ్య‌స‌భ‌లో విప‌క్షాలు బ‌లంగా ఉన్నాయనటానికి సోమవారం జరిగిన ఎన్నికే తార్కాణం. ఓట‌మి త‌ప్ప‌ద‌నే వాతావ‌ర‌ణం కనిపిస్తున్నప్పుడు వ్యూహాత్మ‌కంగా ఎన్నిక నిర్వ‌హించ‌డంలో ఆంతర్యమేమిటో ఎన్నిక రోజునే తెలుస్తుంది.