గౌరవం, ప్రాధాన్యత లేని చోట ఉండలేరట.!

121

తెదేపానేత ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి వైకాపాలో చేర‌బోతున్న‌ట్టు క‌థ‌నాలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని ఆయ‌న ఖండించ‌లేదు, సరికదా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మంలో పార్టీపైనా, కొంత‌మంది నేత‌ల‌పైనా తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసారు.

నెల్లూరు ఇన్ ఛార్జ్ అయిన ఆయన ఆ జిల్లాలో జ‌రిగిన మినీ మ‌హానాడుకి కూడా ఆయ‌న హాజ‌రు కాక‌పోవ‌డంతో గంద‌ర‌గోళ‌మే నెల‌కొంది. అయినాస‌రే, పార్టీ మార్పుపై మౌనంగానే ఉంటూ వ‌చ్చారు. ఎట్టకేల‌కు తాజాగా ఈ అంశంపై ఆయ‌న స్పందించారు.  గుర్తింపూ, గౌర‌వం లేని చోట ప‌నిచెయ్య‌లేన‌ని ఆనం చెప్పారు. గ‌తంలో ఎన్నో ప‌ద‌వులు చేప‌ట్టాన‌నీ, త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల్ని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తించాన‌నీ, కానీ ప్రాధాన్య‌త ద‌క్క‌ని చోట స్త‌బ్దుగా ఉండ‌టం త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని ఆయ‌న అన్నారు.

పార్టీ మార్పుపై స‌న్నిహితులూ, అభిమానులతో చర్చించి రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు సంబంధించిన కీల‌క నిర్ణ‌యం తీసుకుంటానని స్ప‌ష్టం చేసారు. తాజాగా ఆయ‌న కాంగ్రెస్ నేత‌ల‌తో చ‌ర్చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. జిల్లాలోని ప్ర‌ముఖ కాంగ్రెస్ నేత‌ల‌ను క‌లుసుకున్నార‌ట‌. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో మ‌రోసారి బ‌లోపేతం కావాల‌ని భావిస్తున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రానికి పార్టీ వ్య‌హారాల కొత్త ఇన్ ఛార్జ్ గా ఉమెన్ చాందీ కూడా నియ‌మితుల‌య్యారు.

గ‌తంలో పార్టీ వీడి వెళ్ళిపోయిన‌ వారిని తిరిగి ఆహ్వానిస్తామ‌ని ఆయ‌న చెప్పిన నేప‌థ్యంలో ఆనం కాంగ్రెస్ వైపు వెళ్తారా అనే చ‌ర్చ కూడా మొద‌లైంది. ఏపీ కాంగ్రెస్ కి బ‌ల‌మైన నేత‌ల కొర‌త చాలా ఉంది కాబ‌ట్టి, ఇలాంటి అసంతృప్త నేత‌ల్ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం వారికి అనివార్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తెదేపాలో కొన‌సాగటం కష్టమే.