పదిమందిని వెంటేసుకుని వెళుతున్నారట

394

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రేవంత్ రెడ్డి ముహూర్తం పెట్టేసుకున్నారు. రేపు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆయ‌న‌తోపాటు మ‌రికొంత‌మందిని కూడా కాంగ్రెస్ లో చేర్పించేందుకు వెంట‌బెట్టుకుని వెళ్తున్నారు. రేవంత్ తోపాటు మ‌రో ప‌దిమంది ముఖ్య‌నేత‌లు కాంగ్రెస్ లో చేర‌బోతున్న‌ట్టు స‌మాచారం. అయితే, వారు ఎవ‌ర‌నేది మాత్రం పేర్లు బ‌య‌ట‌కి పొక్క‌నీయ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఆ ప‌దిమందిలో కొంత‌మందితో ఇంకా చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం. కాస్త‌ స్థాయి ఉన్న నేత‌ల్నే రేవంత్ ఎంపిక చేసుకున్న‌ట్టు చెబుతున్నారు.

త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు మొద‌ట్నుంచీ పార్టీలో ల‌భించే విధంగా త‌న స్థాయి ఇదీ అని రాహుల్ గాంధీ ద‌గ్గ‌ర ప్ర‌ద‌ర్శించుకునేందుకు వీలుగా కాస్త పేరున్న నేత‌ల్నే త‌న వెంట రేవంత్ పార్టీలోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. రేవంత్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్న నాయ‌కుల‌కు సంబంధించి రెండు జాబితాలు సిద్ధ‌మైంద‌ని తెలుస్తోంది. తొలి జాబితాలో ఓ ప‌దిమందికి రేవంత్ తోపాటు రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కండువా క‌ప్పించ‌బోతున్నారు. మిగ‌తావారిని రెండో విడ‌త‌లో చేర్చుకునే అవ‌కాశం ఉంది. రాహుల్ రాష్ట్రానికి వ‌చ్చిన‌ప్పుడు వారు చేర‌తారా, లేదా పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ కుంతియా స‌మ‌క్షంలో వారిని చేర్పిస్తారా అనేది ఇంకా స్ప‌ష్టంగా తెలియాల్సి ఉంది.

పార్టీలో ప‌నితీరు చూసిన త‌రువాతే ఒక నాయ‌కుడికి ఏ స్థాయి స్థానం క‌ల్పించాల‌నేది కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యిస్తుంద‌ని కుంతియా చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాను కాంగ్రెస్ లోకి ఒంట‌రిగా రావ‌డం లేద‌నీ, త‌న వెంట ఎంతోమంది నేత‌ల్ని తీసుకొస్తున్నానంటూ హైక‌మాండ్ కు రేవంత్ సంకేతాలు ఇస్తున్నారు. రెండు విడ‌త‌ల్లో త‌న బ‌లాన్ని హైక‌మాండ్ ముందు ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం రేవంత్ చేస్తున్న‌ట్టుగా ఉంద‌ని చెప్పొచ్చు. భ‌విష్య‌త్తులో ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయో తెలీదు గానీ రేవంత్ లాంటి మాస్ లీడ‌ర్ పార్టీలోకి రావ‌డంతో కేడ‌ర్ కు కొత్త ఊపు వ‌స్తుంద‌నే ఆశాభావం వ్య‌క్త‌మౌతోంది.