రివ్యూ : రివెంజ్ డ్రామాకు పంచభూతాలే ‘సాక్ష్యం’

376

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ జయ జానకీ నాయక సినిమా సక్సెస్ తో ఫాంలో ఉన్నాడు. అదే జోరులో శ్రీవాస్‌ దర్శకత్వంలో సాక్ష్యం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ సినిమా బెల్లంకొండ, శ్రీవాస్ కు సక్సెస్‌ అందించిందా..? చూద్దాం.

కథేమంటే..

స్వస్తిక్‌ నగరం అనే చారిత్రాత్మక ప్రాంతంలో మును స్వామి (జగపతిబాబు) అతని తమ్ముళ్ళు చేసే అన్యాయాలను అక్కడి పెద్ద మనిషి రాజు గారు (శరత్‌కుమార్‌)ఎదిరిస్తుంటారు. ఇది సహించలేని మునుస్వామి మొత్తం రాజుగారి కుటుంబాన్ని చంపేస్తాడు. రాజుగారి భార్య తన కొడుకును లేగ దూడకు కట్టి తప్పిస్తుంది. అలా చావు నుంచి తప్పించుకున్న పిల్లాడిని ఓ వ్యక్తి కాశీలో వదిలేస్తాడు. పిల్లలు లేని శివ ప్రకాష్‌ (జయ ప్రకాష్‌) దంపతులు ఆ పిల్లాడికి విశ్వజ్ఞ (బెల్లంకొండ శ్రీనివాస్‌) అని పేరు పెట్టుకొని పెంచుకుంటారు. శివ ప్రకాష్‌కు విదేశాల్లో వ్యాపారాలు ఉండటంతో విశ్వా అక్కడే పెరిగి పెద్దవాడవుతాడు.

విశ్వా రియాలిటీ వీడియో గేమ్స్ డిజైన్‌ చేస్తూ ఉంటాడు. అమెరికాలో సౌందర్య లహరి (పూజా హెగ్డే)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. తర్వాత విశ్వ, సౌందర్యలు చిన్న అపార్థం కారణంగా విడిపోతారు. సౌందర్య ప్రేమ కోసం ఇండియా వచ్చిన విశ్వను పంచభూతాలు ఎలా నడిపించాయి..? తనకు తెలియకుండా తన కుటుంబానికి అన్యాయం చేసిన వారిని విశ్వ ఎలా అంతమొందించాడు..? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

సినిమా ఎత్తుగడ స్మూత్ గానే వుంటుంది. కానీ హీరో అసలు కథలోకి వచ్చేవరకు మాత్రం బోరింగ్ కానే ఉంటుంది. హీరో వృత్తి వ్యవహారాలు, హీరోయిన్ పరిచయం, ఆమె సంగతులు విసుగు తెప్పిస్తాయి. తొలిసగం యావరేజ్ మార్కులు మాత్రమే తెచ్చుకుంటుంది. కథ ద్వితీయార్థంలోకి ప్రవేశించాక, అడ్డంపడే పాటల సంగతి పక్కన పెడితే, మిగతాది అంతా గ్రిప్పింగ్ కానే సాగుతుంది. వివిధ లోకేషన్లు, యాక్షన్ సీన్లు, ఆ ప్లానింగ్ అంతా కాస్త కొత్తగా ఆకట్టుకుంటాయి. క్లయిమాక్స్ బాగుంది. ద్వితీయార్థం వల్లనే సినిమా కాస్త నిలబడుతుందనే ఆశ కలుగుతుంది. కానీ ద్వితీయార్థంలో ప్రతి పాత్రను కథతో ముడిపెట్టేందుకు దర్శకుడు డిసైడ్ కావడంతో నిడివిని పెంచేసాయి.

ఎవరెలా..

బెల్లంకొండ శ్రీనివాస్‌ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ యాక్షన్ డ్రామాలో మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్‌, డ్యాన్స్‌ లు ఇరగదీసాడు. సౌందర్య లహరి పాత్రలో పూజా హెగ్డే ఒదిగిపోయింది. నటనపరంగా ఓకే అనిపించినా గ్లామర్‌, లుక్స్‌తో సూపర్బ్‌ అనిపించింది. విలన్‌ గా జగపతి బాబు మరోసారి తన మార్క్‌ చూపించారు. వేమన పద్యాలు చెపుతూ సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌ తో మంచి విలనిజం పండించారు. అశుతోష్‌ రానా, రవికిషన్‌లు కూడా ఆకట్టుకున్నారు. దర్శకుడు ఈ సినిమా కోసం కొత్త పాయింట్ ను ఆలోచించిన తరువాత, పాత వ్యవహారాలను కాస్త తగ్గించేయాల్సింది. ముఖ్యంగా లవ్ ట్రాక్ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. సినిమాకు ఫ్యామిలీలను రప్పించడం అన్న విషయం మరిచిపోయి, హింసను పెంచేసారు.

ఫైనల్ గా..

ఏదో కొత్తదనం ఉంటే తప్పితే జనాలు థియేటర్ కు రావడం లేదు. అయితే ఈ సినిమా చిన్నది కాదు. చాలా పెద్దది. ఇలా భారీ కథ రాజమౌళి చేతిలో పడితేనా? అని మీకు అనిపిస్తే అది మా తప్పు కాదు.