‘సుబ్రహ్మణ్యపురం’ రివ్యూ: ‘థ్రిల్’ మిస్సయింది

335

అక్కినేని కుటుంబ నటుడు సుమంత్‌ వినూత్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అదే పంధాలో ఈ సారి థ్రిల్లర్‌ కథాంశంతో ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రాన్ని ఎంచుకున్నాడు. దేవుడు ఉన్నాడా? మానవ మేథస్సు గొప్పదా? అనే అంశం చుట్టూ రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘సుబ్రహ్మణ్యపురం’ఎలా ఉందో చూద్దాం.

కథేమంటే:

కార్తీక్‌ (సుమంత్‌) పురాతన దేవాలయాలపై పరిశోదన చేస్తూ ఉంటాడు. కార్తీక్‌కు దేవుడు అంటే నమ్మకం ఉండదు. ప్రతిదానికి కారణాలు వెతుకుతుంటాడు. దేవుడంటే భక్తి, నమ్మకం ఉన్న ప్రియ (ఈషారెబ్బా)తో దేవుడి విషయంలో వాదోపవాదాలు జరుగుతుంటాయి. సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో వరుసగా ఆత్మహత్యలు చోటుచేసుకుంటాయి. దేవుడి అనుగ్రహం తమపై లేదని, దేవుడి ఆగ్రహానికి లోనుకావడం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఊరి ప్రజలు నమ్ముతారు. దేవుడిపై ఏ మాత్రం నమ్మకంలేని కార్తీక్‌ ఆ ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం ప్రారంభిస్తాడు. దేవుడి గురించి, ఆ ఊరిలో ఉన్న ఆలయం గురించి కార్తీక్‌కు తెలిసిన నిజాలేంటి? అన్నదే ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా.

ఎలా ఉందంటే:

దేవుడు, మూఢనమ్మకాలు, భక్తి ఇలాంటి అంశాలపై వచ్చిన మరో చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. నాస్తికుడికి, దేవుడిపై నమ్మకం ఉన్న గ్రామానికి మధ్య ఏం జరిగిందన్నది చెప్పాలని దర్శకుడు ప్రయత్నించాడు. థ్రిల్లర్‌ చిత్రాల్లో కథనం, మలుపులు చాలా కీలకం. దర్శకుడు తాను వేసిన చిక్కుముడిని ఎలా విప్పాడన్నదే కీలకం. అయితే ‘సుబ్రహ్మణ్యపురం’ దానికి విరుద్ధంగా సాగుతుంది. కథని, పాత్రల పరిచయాన్ని చాలా నెమ్మదిగా ప్రారంభించిన దర్శకుడు అసలు కథలోకి వెళ్ళడానికి సమయం తీసుకున్నాడు. ఆత్మహత్యలు జరగడం మినహా ప్రథమార్ధంలో మలుపులు ఏమీ కనిపించవు. ద్వితీయార్ధంలో ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేయడంలో సఫలం అయినా పతాక సన్నివేశాల వరకూ కొనసాగించడంలో తడబడ్డాడు. కీలకమైన ప్రీ క్లైమాక్స్‌లో అసలు ముడి షాకింగ్‌గా అనిపించదు.

ఎవరెలా :

హేతువాది పాత్రలో సుమంత్‌ నటన సహజంగా కనిపిస్తుంది. ఈషా రెబ్బా పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. సీనియర్‌ నటులు సురేష్‌, సాయికుమార్‌లకు మంచి పాత్రలు దక్కాయి. నటుడు భద్రమ్‌ నవ్వించే ప్రయత్నం చేసాడు. చెప్పాలనుకున్న పాయింట్‌ బాగానే ఉన్నా దాన్ని తెరపై ఆసక్తిగా మలచడంలో దర్శకుడు తడబడ్డాడు.

ఫైనల్ గా:

దేవుడు-మనిషి ఈ కాన్సెప్ట్‌ ఎప్పుడూ సక్సెస్‌ ఫార్మూలానే. నమ్మకాలు-నిజాలు, వాస్తవాలు-ఊహలకు మధ్య అల్లే కథ ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. కానీ ‘సుబ్రహ్మణ్యపురం’లో మాత్రం థ్రిల్ మిస్సయింది.