ఏపీ కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్

243

ఆంధ్రప్రదేశ్ పోలీస్‌ బాస్‌గా ప్రస్తుతం ఏసీబీ చీఫ్‌గా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ నియమితులయ్యారు. చివరి వరకూ విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ పేరు వినిపించినా చివరికి ఆర్పీ ఠాకూర్‌ వైపే మొగ్గు చూపారు. ఆర్పీ ఠాకూర్ పూర్తి పేరు రామ్‌ ప్రవేశ్ ఠాకూర్.

1986 బ్యాచ్‌కు చెందిన ఈ ఐపీఎస్ అధికారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఏసీబీ చీఫ్‌గా 2016 నవంబర్ 19 నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్పీ ఠాకూర్ ఏసీబీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద పెద్ద తిమింగలాలను సైతం వదిలి పెట్టలేదు. అవినీతి పరులపై అక్షరాలా ఉక్కుపాదం మోపారు. ఠాకూర్ సారధ్యంలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, మెయిల్‌ ఐడీలతో సామాజిక మాధ్యమాలను వినియోగించుకొని సెల్‌ నెంబర్ల లాంటివన్నీ ప్రచారం చేసి కిందిస్థాయి సమాచారం సేకరిస్తూ ఏసీబీ దూకుడుగా పని చేసింది.

మొదట పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు, ఆ తర్వాత తహశీల్దార్లు, అక్కడి నుంచి జడ్పీ సీఈవో, డీటీసీ స్థాయి అధికారులపై పడిన ఏసీబీ అధికారులు ఏకంగా ఈఎన్‌సీలను సైతం పట్టుకున్నారు. 1961 జూలై 01 న జన్మించిన ఠాకూర్ IIT కాన్పూర్ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివారు. హైదరాబాద్ లోని జాతీయ పోలీసు అకాడమిలో అదనపు ఎస్పీగా నియామకం అనంతరం గుంటూరు, వరంగల్ జిల్లాల్లో ASP గా బాధ్యతలు నిర్వహించారు.

2016 నవంబర్ 19 నుంచి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతల నిర్వహిస్తోన్న ఠాకూర్ 2011 లో భారత రాష్ట్ర పతి చేతుల మీదుగా మెడల్ పొందారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి రగులుతున్న తరుణంలో డీజీ హోదాలో రాష్ట్రంలో పోలీసు దళాల అధిపతి బాధ్యతలు చేపట్టనున్న ఠాకూర్ కు కత్తిమీద సవాలే.