కోదండరాంకు కోరినన్ని స్థానాలు ఇవ్వాల్సిందేనట

167

తెలంగాణ మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు, ఏ ఏ సీట్లు అన్న అంశంపై చర్చలు జరుగుతున్నా ఎక్కడా తెగడం లేదు. పెద్దన్నగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ పార్టీ తీరు ఇతర పార్టీలను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది.

కాంగ్రెస్ పార్టీ సీట్ల గురించి ఏ మాత్రం చెప్పకుండా పని చేసుకుంటూ పోతోంది. అన్ని పార్టీలనూ కలసి రావాలని చర్చలు జరిపిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీట్ల పంపిణీ విషయంలలో ఎటూ తేల్చడం లేదు. మూడు సీట్లు, నాలుగు సీట్లు అంటూ లీకులిస్తూ అందర్నీ అసహనానికి గురి చేస్తున్నారు. ఈ విషయంలో సీట్ల చర్చల కోసం సిద్ధమైనప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  పార్టీ వ్యవహారాల్లో మునిగిపోవటంతో తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం చాలా సీరియస్ గా ఉన్నారు.

సీట్ల సర్దుబాటుకు 48 గంటల డెడ్ లైన్ విధించారు. 48 గంటల తర్వాత టీజేఎస్ అభ్యర్థుల లిస్టును విడుదల చేస్తామని ప్రకటించారు. తాము కోరినన్ని సీట్లు, కోరిన స్థానాలు ఇవ్వాల్సిందేనని కోదండరామ్‌ పట్టు బడుతున్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కాకపోతే కలిసొచ్చే శక్తులతో ఎన్నికలకు వెళ్ళాలాలని తెలంగాణ జనసమితి భావిస్తోంది. దీని కోసం కోదండరాం ఇప్పటికే ప్లాన్ బీ అమలు చేస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

టీజేఎస్‌ అధినేత డెడ్ లైన్ గురించి తెలిసిన వెంటనే టీటీడీపీ నేత ఎల్ రమణ టీజేఎస్ ఆఫీసుకు వెళ్ళి చర్చించారు. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తమ పార్టీ తరపున అందరూ కొత్త వారే పోటీ చేస్తారని ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున కేటాయించే స్థానాలపై క్లారిటీ ఇస్తే బాగుంటుందని కోదండరాం చెప్పినట్లు తెలుస్తోంది. కూటమిలో ఉన్న ఇతర పార్టీలు, తెదేపా, సీపీఐ సీట్ల విషయమూ ఎటూ తేలలేదు. నవ తెలంగాణ లాంటి చిన్న పార్టీలు కూడా సీటు కోసం చూస్తున్నాయి. మరో వైపు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మిత్రపక్షాలన్నింటికీ కలిపి 19 సీట్లు ఇవ్వాలని తీర్మానం చేసింది.