‘శంకర్’ ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్నాడేమో.?

260

బుల్లితెరపై ‘జ‌బ‌ర్దస్త్’ కామెడీ కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకుని, ఆ త‌ర‌వాత హాస్య‌న‌టుడిగా కొన్ని సినిమాలు చేసి, ఇప్పుడు ఏకంగా హీరోగా ప్ర‌మోష‌న్ తెచ్చుకున్న ష‌క‌ల‌క శంక‌ర్‌ నటించిన చిత్రం ‘శంభో శంక‌ర‌’. ఈ చిత్రం ఈ వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. అయితే ఈ సినిమా అవకాశం శంకర్ కు సులువుగా రాలేదట. ఈ స్క్రిప్టు ప‌ట్టుకుని చాలా చోట్ల తిరిగాడు శంక‌ర్‌.

చాలామందిని క‌లిసి నిర్మాత‌గా ఉంటారా? అని నోరు తెర‌చి అడిగినా ఏ ఒక్క‌రూ ధైర్యం చేయ‌లేదు. ఈ విష‌యాన్ని ప్రీ రిలీజ్ వేడుకలో శంకర్ స్వ‌యంగా చెప్పాడు. దిల్‌రాజు, త్రివిక్ర‌మ్‌, అల్లు శిరీష్‌, ర‌వితేజ వీళ్ళంద‌రినీ క‌ల‌సి ‘రెండు కోట్లు పెట్టండి.. ఎనిమిది కోట్లు వ‌చ్చేలా చేస్తా’ అని బిజినెస్ కూడా మాట్లాడాడ‌ట‌. కానీ ఒక్క‌రు కూడా ధైర్యం చేయలేదు. ర‌వితేజ అయితే ‘ఇప్పుడు కమెడియన్ గా నీకేం త‌క్కువ‌, హీరోగా చేయాల్సినంత అవ‌స‌రం ఏముంది అని అన్నాడ‌ట‌.

అయితే శంకర్ ఇక్కడ ఒక లాజిక్ వదిలేస్తున్నాడు. తాను చెపుతున్న స్క్రిప్టు వేరొక‌రి చేతుల్లో ప‌డి సినిమాగా మారిపోయి హిట్ట‌య్యాక‌, నాలుగు డ‌బ్బులొచ్చాక‌ క‌థ‌ని, ఈ సినిమాని ఇంత మంది రిజ‌క్ట్ చేసారు అని చెప్పుకోవ‌డం బాగుంటుంది. కానీ సినిమా విడుద‌ల కాక‌ముందే ఇంతమంది కాదన్నారు అని చెబితే ఎలా? ఎందుకు వద్దన్నారో అనే నెగిటీవ్ ప‌బ్లిసిటీ అయిపోదా? శంక‌ర్ ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్స‌య్యాడో.

పైగా క‌మెడియ‌న్‌గా అవ‌కాశాలు లేవు అందుకే హీరో అయ్యా అని చెప్పుకుంటున్నాడు. క‌మెడియ‌న్‌గా రాణించి బిజీగా ఉన్న వారికే హీరోగా క‌ల‌సి రావ‌డం లేదు. అలాంటిది శంక‌ర్ త‌న‌పై తాను ఇంత న‌మ్మ‌కం ఎలా పెట్టుకున్నాడో అర్థం కావ‌డం లేదు. అదృష్టం, సమయం కలిసొచ్చి సినిమా హిట్టై ఎనిమిది కోట్లు వసూలు చేస్తే దిల్‌రాజు, త్రివిక్ర‌మ్‌, ర‌వితేజ‌లు అయ్యో అని ఫీల‌వుతారు. అటూ ఇటూ అయితే శంక‌ర్‌కి ఇప్పుడొస్తున్న ఛాన్సులు కూడా కష్టమే కదా.?