కోదండరాం ఏం కోరుకుంటున్నారు.?

94
తెలంగాణ‌లో ‘మిలియ‌న్ మార్చ్’ అంటే అంద‌రికీ బాగా గుర్తున్న సంఘ‌ట‌న‌.  రాష్ట్ర సాధ‌న ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేసిన ప్ర‌ధాన‌మైన ఘ‌ట‌న అని కూడా దాన్ని చెప్పొచ్చు. ఆరోజున వేల‌ల్లో తెలంగాణ ప్ర‌జ‌లు హైద‌రాబాద్ చేరుకోవ‌డం, నెక్లెస్ రోడ్డులో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు పెద్ద ఎత్తున జ‌రిగాయి. ఇప్పుడు మిలియిన్ మార్చ్‌ స్ఫూర్తి సంస్మ‌ర‌ణ దినోత్స‌వం జ‌ర‌ప‌డం కోసం కోదండ‌రామ్ నాయ‌క‌త్వంలో టీజేయేసీ ప్ర‌య‌త్నించింది. అయితే, ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేదు.
నాటి మిలియ‌న్ మార్చ్ ను స్మ‌రించుకుంటూ ప్ర‌స్తుత స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి స్ఫూర్తి పొందాల‌నే ఉద్దేశంతో టీజేయ‌స్‌, కొన్ని విద్యార్థి సంఘాలు, క‌మ్యూనిస్టు పార్టీలు ప్ర‌య‌త్నించాయి. అయితే, ఈ మార్చ్ కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేదు. నిజానికి, ఈ కార్య‌క్ర‌మాన్ని అత్యంత భారీ ఎత్తు నిర్వ‌హించాల‌నే ఉద్దేశం కోదండ‌రామ్ కి లేదు. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి ప్ర‌జ‌లను త‌ర‌లించాల‌నే యోచ‌న కూడా వారికి ఉన్న‌ట్టు క‌నిపించ‌లేదు. ఒక సాధార‌ణ కార్య‌క్ర‌మంగా దీన్ని నిర్వ‌హించుకోవాల‌ని అనుకున్నారు. అయితే, ప్ర‌భుత్వం అనూహ్యంగా తీవ్రంగా స్పందించడంతో అంద‌రూ ఈ కార్య‌క్ర‌మం వైపు చూడ‌టం మొద‌లుపెట్టారు.
అనుమ‌తి నిరాక‌రించి మౌనంగా ఉంటే స‌రిపోయేది. కానీ, పార్కుల‌కు తాళాలు వేసి, ట్యాంక్ బండ్ వైపు ఎవ్వ‌రూ రాకుండా ముంద‌స్తుగానే పోలీసుల హ‌డావుడి పెంచి, ఆ దారిలో ఎవ‌రు వెళ్తున్నా త‌నిఖీలు చేసి ఇలా ట్యాంక్ బండ్ చుట్టుప‌క్క‌ల‌ చిన్న‌త‌ర‌హా క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణాన్ని సృష్టించారు. మొత్తానికి, ఈ కార్య‌క్ర‌మం అన‌గానే తెరాసలో ఎందుకో తెలియ‌ని ఉలికిపాటు క‌నిపిస్తోంది. కోదండ‌రామ్ నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌న్నీ తెరాస‌కు వ్య‌తిరేకంగా ఉంటాయ‌నే ముద్ర ఎప్పుడో ప‌డిపోయింది. పైగా, ఉద్య‌మ స‌మ‌యంలో జ‌రిగిన మిలియ‌న్ మార్చ్ తీవ్ర‌త ఏపాటిదో వారికి బాగా తెలుసు.
 ఒక‌వేళ ఆ స్థాయి స్ఫూర్తి మ‌రోసారి ర‌గులుకోవ‌డానికి ఈ కార్య‌క్ర‌మం పునాదిగా మారుతుందేమో అనే టెన్ష‌న్ తెరాస‌లో ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఏ ల‌క్ష్యం కోస‌మైతే తెలంగాణ సాధించుకున్నామో, ఆ ల‌క్ష్యం నెర‌వేరుతోందా అనే నినాదంతోనే కోదండ‌రామ్ ఈ మ‌ధ్య ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా ప్ర‌శ్నిస్తున్న తీరు అంద‌రికీ తెలిసిందే. దీంతో ఈ కార్య‌క్ర‌మం ఎలాగూ అధికార పార్టీ వ్య‌తిరేక కార్య‌క్ర‌మం కాబోతోంద‌న్న ముంద‌స్తు అంచ‌నాల‌తోనే ఇంత‌ హ‌డావుడి చేస్తున్నారు. నిజానికి, వారు చేసే హ‌డావుడి వ‌ల్ల‌నే దీనికి ఇంత ప్రాధాన్య‌త ఉందా అనే అభిప్రాయం ప్ర‌జ‌ల‌కు క‌లుగుతోంది.