స్మృతీ ఇరానీకి మరోసారి ‘డిమోషన్’

106

కేంద్ర సమాచార, జౌళి శాఖల మంత్రి స్మృతి ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి షాకిచ్చారు. అత్యంత కీలకమైన కేంద్ర సమాచార శాఖను తప్పించి ఆమెకు జౌళి శాఖను మాత్రమే ఉంచారు. నరేంద్రమోదీ ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు. తొలుత తన కేబినెట్‌లోకి స్మృతి ఇరానీని తీసుకున్నప్పుడు ఆమెకు ఇచ్చిన హెచ్‌ఆర్డీ మినిస్ట్రీ నుండి ఆమెను తప్పించి ప్రకాష్ జవదేవర్‌కు అప్పగించారు.

ఇప్పుడు రెండోసారి ఆమెకు డిమోషన్ ఇచ్చి మోదీ ఆమెపై పగ తీర్చుకుంటున్నారా..? అన్న అంశంపై పెద్దగా క్లారిటీ లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు చెలరేగిన అల్లర్ల కారణంగా ఆయనను సీఎం పదవి నుంచి తప్పించాలని స్మృతి ఇరానీ నిరాహారదీక్ష చేసారు. దీన్ని గుర్తు పెట్టుకునే స్మృతి ఇరానీ ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ రాజకీయంగా బలపడకుండా చేస్తున్నారని కొందరు చెప్పుకుంటున్నారు. మరి కొంతమంది ఏ శాఖ నిర్వహిస్తున్నా ఆమె వివాదాలు కొని తెచ్చుకుంటున్నారని అంటున్నారు.

హెచ్‌ఆర్డీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆమె విద్యార్హతలపై వివాదం తలెత్తింది. హెచ్‌సీయూలో జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనను సరిగ్గా డీల్ చేయలేపోయారు. దాంతో మోదీ ఆమెకు సమాచారప్రసార, జౌళి మంత్రిత్వ శాఖలను అప్పగించారు. అయితే రెండు రోజుల కిందట నాలుగేళ్ళలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రచారం, ప్రకటనల కోసం ఏకంగా రూ.4343 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఆర్‌టీఐ కింద వచ్చిన ధరఖాస్తుకు సమాచార మంత్రిత్వ శాఖ ఈ వివరాలు ఇచ్చింది. మోదీ ప్రచారం కోసం ప్రజాధనం వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇలాంటి కీలకమైన సమాచారాన్ని బయటపెట్టి స్మృతి తన ఇమేజ్‌ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని మోదీ ఆగ్రహించినట్లు తెలుస్తోంది. అందుకు ఫలితంగానే ఎలాంటి ప్రాధాన్యతా లేని జౌళిశాఖకు పరిమితం చేసారని అనుకుంటున్నారు.