సరిహద్దులో ఏదో పెద్దదే జరిగిందట.!

114

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. మొన్నామధ్య ఓ సైనికుడ్ని అత్యంత దారుణంగా పాకిస్థాన్ బలగాలు హతమార్చటంతో మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లుగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెబుతున్నారు.

ఎన్నికలకు కొద్దిగా ముందుగా దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వస్తాయని చెబుతున్నారు. కొద్ది రోజుల నుంచి ముఖ్యంగా ‘రాఫెల్’ బయటపడినప్పటి నుంచి పాకిస్థాన్ అంశాన్నిభాజపా పదే పదే ప్రస్తావిస్తోంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని పాకిస్థాన్ కోరుకుంటోందని చెప్పుకొస్తున్నారు. దానికి సంబంధించి ఆ పార్టీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మోడీ అంటే పాకిస్థాన్ వణికిపోతోందని.. ఆయన ప్రధానిగా ఉంటే పాకిస్థాన్ ఆటలు సాగడం లేదని ఎవరో ముస్లిం నేతలు ప్రసంగిస్తున్నట్లుగా వీడియోలు ప్రచారం చేసేస్తున్నారు.

పాకిస్థాన్‌ను నిలువరించాలంటే మోడీ ప్రధానిగా ఉండాలన్నట్లుగా భావోద్వేగం పెంచడానికి ఒక్కో స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నారన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. నిజానికి మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాలుగున్నరేళ్ళలో పాకిస్థాన్‌ను ఎంత మేర కట్టడి చేసారు?. చివరికి కశ్మీర్‌లో ప్రభుత్వంలో భాగంగా ఉండి కూడా శాంతిభద్రతలను రక్షించలేక మిత్రపక్షంపై నెపం వేసి ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు.

పాకిస్థాన్ కొత్త అధ్యక్షుడితో చర్చలు ప్రారంభించాల్సిన అవకాశం వస్తే పక్కన పెట్టేసారు. ఇప్పుడు కొత్తగా పాకిస్థాన్ పై శతఘ్ని దాడులు చేసామంటూ ప్రకటనలు చేస్తున్నారు.