చంద్రబాబును తెగుడుతూనే పొగుడుతున్నారు

126

పోల‌వ‌రం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాబ‌ట్టి, దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్య‌త కేంద్రంపైనే ఉంటుంద‌నీ, ఆల‌స్యం అవుతుండ‌టానికి కార‌ణం కేంద్రం వైఖ‌రే అనే అభిప్రాయాన్ని తెదేపా నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌కీయంగా చూసుకున్నా పోల‌వ‌రం కోసం చంద్ర‌బాబు ప‌డుతున్న క‌ష్టాన్ని ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నార‌నే భావాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళటానికి మీడియా కూడా ప్ర‌య‌త్నిస్తోంది. పోల‌వ‌రం పూర్తి కాక‌పోతే భార‌తీయ జ‌న‌తా పార్టీపై ఏపీ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ నేత‌, భాజ‌పా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఒక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. పోల‌వ‌రంపై భాజ‌పాకి ఉన్న నిబ‌ద్ధ‌తని తెలియచేస్తూ గ‌తాన్ని గుర్తు చేసారు. 2005లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి  పోల‌వ‌రం ప్రాజెక్టును ప్రారంభించార‌నీ, 2011 నుంచి తెలంగాణ ఉద్య‌మం వ‌చ్చింద‌నీ అక్క‌డి నుంచే పోల‌వ‌రంపై స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయ‌ని సోము వీర్రాజు చెప్పారు. అదే స‌మ‌యంలో, తెలంగాణలోని అన్ని పార్టీల నేత‌లూ క‌ల‌సి పోల‌వ‌రం డామ్ ఎత్తు త‌గ్గించాల‌నీ, లేదంటే రాజ‌మండ్రి ముగినిపోతుంద‌నీ, ఇలాంటి అనుమానాల‌ను ఆంధ్రా నేత‌ల‌తో వారు మాట్లాడించేవార‌న్నారు.

ఇలా ఇబ్బందులు చోటు చేసుకున్న స‌మ‌యంలో భాజ‌పా నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. పోల‌వ‌రం గురించి మాట్లాడొద్ద‌ని చెప్పామ‌న్నారు. కిష‌న్ రెడ్డి ఉభ‌య రాష్ట్రాల అధ్య‌క్షుడిగా ఉండ‌గా, ఆయ‌న్ని రాజమండ్రి తీసుకెళ్ళి పోల‌వ‌రం గురించి మాట్లాడించామ‌నీ చెప్పారు. మీకు తెలంగాణ ఎంత ముఖ్య‌మో, మాకు పోల‌వ‌రం అంతే ప్రాధాన్య‌మైంద‌ని వివ‌రించామ‌ని చెప్పారు. పోల‌వ‌రం గురించి తెలుసుకున్న కేసీఆర్ కూడా ముంపు మండ‌లాలు కావాలని ప‌ట్టుబ‌ట్టార‌నీ చెప్పారు.

ప్ర‌స్తుతం పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో చోటు చేసుకున్న స‌మ‌స్య‌ కాంట్రాక్ట‌రూ ప్ర‌భుత్వానికి మ‌ధ్య మాత్ర‌మే వ‌చ్చింద‌న్నారు. ‘పోల‌వ‌రాన్ని రాజ‌కీయ అంశంగా చూడొద్దు, కావాలంటే రాజ‌కీయంగా వినియోగించుకోండీ త‌ప్పులేదు’ ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేసారు. పోల‌వ‌రం ప్రాజెక్టును వంద‌శాతం పూర్తి చేస్తామ‌నీ, చంద్రబాబు నిబ‌ద్ధ‌త మీద త‌మ‌కు న‌మ్మ‌కం ఉంద‌నీ, వారే నిర్మిస్తార‌ని చెప్పారు. ఒక ప్రక్క తెదేపాను విమర్శిస్తూనే చంద్ర‌బాబు నిబద్ధ‌త‌పై న‌మ్మ‌కం ఉంద‌ని కూడా చెప్ప‌టంలో అర్ధమేమిటి.? ఏం చెప్పినా రాష్ట్ర భాజ‌పా నేత‌లు పోలవరం కోసం చేయ‌బోతున్న కృషి ఏంట‌నేది మాత్రం చెప్పలేదు.