చేసేది మేమైతే ..క్రెడిట్ మాత్రం తెదేపాకి

341

కేంద్రంలో తాము అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో తెలుగుదేశం అదుపాజ్ఞ‌ల్లో ఉండాల్సి వ‌స్తోంద‌నే ఆవేద‌న కొంత‌మంది ఆంధ్రా భాజ‌పా నేత‌ల‌కు ఎప్ప‌ట్నుంచో ఉంది. పొత్తు ఉన్నంత మాత్రాన త‌మ పార్టీకి ద‌క్కాల్సిన ప్రాధాన్య‌త తెదేపా ఇవ్వ‌డం లేద‌ని వాపోతుంటారు. కేంద్రం ఇస్తున్న నిధులు, అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల క్రెడిట్ కూడా తెదేపా సొంత ఖాతాలో వేసేసుకుంటోంద‌న్న‌ది వాస్త‌వం. అయితే, దీనిపై ఏపీ భాజ‌పా నేత‌లంద‌రూ స్పందించరు. ఎందుకంటే, ఏపీ భాజ‌పాలో చంద్ర‌బాబు అత్యంత స‌న్నిహిత వ‌ర్గీయులే.

కేవ‌లం ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాత్ర‌మే ఎప్ప‌టిక‌ప్పుడు ఈ వాద‌న వినిపిస్తూ ఉంటారు. కేంద్రం నిధుల‌ను రాష్ట్రం ఘ‌న‌త‌గానే చెప్పుకుంటున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటారు. తాజాగా మ‌రోసారి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. మ‌రుగుదొడ్ల నిర్మాణం మొద‌లుకొని పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ర‌కూ కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంద‌ని వీర్రాజు అన్నారు. అయితే, ఈ పనుల‌న్నీ కేంద్రం వ‌ల్ల జ‌రుగుతూ ఉంటే అది త‌మ ఘ‌న‌తే అన్న‌ట్టుగా తెదేపా చెప్పుకుంటోంద‌ని విమ‌ర్శించారు. భాజ‌పా చేస్తున్న ప‌నులేవీ క‌నిపించ‌కుండా చేస్తున్నారనీ, దీంతో కార్య‌క‌ర్త‌లు మౌనంగా ఉండిపోవాల్సి వ‌స్తోంద‌న్నారు.

పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇంత‌వ‌ర‌కూ రూ. 6 వేల కోట్లు మంజూరు చేసింద‌న్నారు. అయితే, ఇదంతా త‌న కృషి అన్న‌ట్టుగానే చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం చేసుకుంటున్నారని చెప్పారు. ఈ మ‌ధ్య‌నే స్వ‌చ్ఛ భార‌త్ ప్రచార పోస్ట‌ర్ల‌పై ప్ర‌ధాన మోడీ ఫొటో పెట్ట‌లేదంటూ వీర్రాజు ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. వీర్రాజు ఆవేద‌న‌లో వాస్త‌వాలు కూడా లేక‌పోలేదు. చెప్పుకోవ‌డానికి ఏమీ మిగ‌ల్చ‌క‌పోతుండ‌టంతో కార్య‌క‌ర్త‌లు తీవ్ర నిరాశ‌కు గురౌతున్న సంగ‌తి వాస్త‌వ‌మే.

వీర్రాజు ఆవేద‌న వినేది ఎవ‌రు? రాష్ట్రంలో ఇత‌ర ప్ర‌ముఖ భాజ‌పా నేత‌లు ఎవరూ ఇలా మాట్లాడిన సంద‌ర్భాలు కనిపించవు. వీర్రాజు వాద‌న‌ను స‌మర్థించే భాజ‌పా నేత‌లు ఎవరూ కనిపించటం లేదు.