జైట్లీ గారు ఏపీకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసారట.!

95
గ‌త నాలుగేళ్ళలో కేంద్రం ఆంధ్రాకి ప్ర‌త్యేకంగా ఏమిచ్చిందో ఎవ్వ‌రికీ తెలీదు. తాజా బ‌డ్జెట్ లో చూసుకున్నా ఇత‌ర రాష్ట్రాల కంటే త‌క్కువ కేటాయింపులు ద‌క్కాయి. కానీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏమంటున్నారంటే ‘ఏపీకి ఇవ్వాల్సిన‌వ‌న్నీ ఇచ్చేసాం, ఇంకా ఒక‌టో రెండో అంశాలు మిగులున్నాయి, అవి కూడా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయ‌ని అంటున్నారు. ఏపీ హోదా కోసం అన్ని పార్టీలూ ఒక‌ట‌య్యాయి, జాతీయ స్థాయిలో ఆంధ్రా అంశం చ‌ర్చ‌నీయం అవుతోంది. ఇతర పార్టీల మద్దతు పెరుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్ర‌క‌ట‌న కొంత ఊర‌ట క‌లిగించే విధంగా, ప‌రిస్థితిని కాస్త శాంతింప‌జేసే విధంగా ఉంటుంద‌ని అనుకుంటే ఆంధ్రాపై పరిపూర్ణ నిర్ల‌క్ష్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించారు.
రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆంధ్రాకు న‌ష్టం జ‌రిగిన మాట వాస్త‌వమేన‌నీ, అందుకే ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చామ‌ని చెప్పారు. ప్యాకేజీలో ఇస్తామ‌న్నవాటిలో ఇప్ప‌టికే చాలా అమ‌లు చేసామ‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు సంతృప్తి ప‌డేలా ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. రాజ‌ధాని అమ‌రావ‌తికి కొన్ని నిధులు ఇచ్చామ‌నీ, పోల‌వ‌రం నిర్మాణ వ్య‌వ‌య‌మంతా కేంద్ర‌మే భ‌రిస్తోంద‌నీ, అది త‌మ బాధ్య‌త అన్నారు. అన్నీ బాగానే ఉన్నాయ‌నీ, ఒక్క రెవెన్యూ లోటు భ‌ర్తీ విష‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య కొంత తేడా ఉంద‌నీ, అది కూడా త్వ‌ర‌లోనే చ‌ర్చ‌లతో ప‌రిష్కృతం అవుతుంద‌ని చెప్పారు.
ఏపీ ప‌ట్ల కేంద్రం సానుభూతితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని చెప్పటం విచిత్రంగా ఉంది. ఆంధ్రాకు అన్నీ ఇచ్చేసామ‌ని ఏమాత్రం త‌డుముకోకుండా, త‌త్త‌ర‌పాటు లేకుండా, సాక్షాత్తూ దేశ ఆర్థిక‌మంత్రి చెప్ప‌డం అనేది అత్యంత దారుణమైన విషయం. బడ్జెట్ లో ఆంధ్రాకు కేటాయించిన లెక్క‌లు ఆయ‌న‌కి తెలియ‌వా..? గడచిన నాలుగేళ్ళలో అన్నీ ఇచ్చేస్తే ఏపీలో రాజకీయ పార్టీలన్నీ ఎందుకు ఏకమౌతున్నాయి?
రాష్ట్ర విభ‌జ‌న పాపం కాంగ్రెస్ పార్టీద‌నీ, అందుకే ఏపీకి ఇన్ని స‌మ‌స్య‌ల‌ని ప్ర‌ధాన‌మంత్రి మోడీ చ‌ర్చ‌ను ఎటో మళ్ళించే ప్ర‌య‌త్నం చేసారు. మ‌రో అడుగు ముందుకేసిన ఆర్థిక‌మంత్రి ఆంధ్రాకు అన్నీ ఇచ్చేసాం, మీ ఇష్ట‌మొచ్చింది చేసుకోండన్న‌ట్టుగా తెగేసి మ‌రీ చెప్పేసిన‌ట్టు ప్ర‌సంగించారు. ఏపీ విష‌యంలో కేంద్రం అంత ఈజీగా దిగొస్తుంద‌న్న సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు.