రివ్యూ : దేశీయ బాండ్ ‘గూఢచారి’

164

‘క్షణం’ సినిమాతో నటుడిగానే కాక రచయితగా కూడా సూపర్ హిట్ అందుకున్న అడివి శేష్ మరోసారి తన కథా కథనాలతో ‘గూఢచారి’గా వచ్చాడు. శశి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది.? అనేది చూద్దాం.

కథేమంటే..

గోపి (అడివి శేష్‌) ‘రా’ అధికారి రఘువీర్‌ కొడుకు. గోపి చిన్నతనంలోనే సిక్కింలో జరిగిన ఆపరేషన్‌లో రఘువీర్‌ చనిపోతాడు. దీంతో రఘువీర్‌ స్నేహితుడు సత్య (ప్రకాష్ రాజ్‌), గోపికి ప్రాణ హాని ఉందని అర్జున్‌ కుమార్‌ పేరుతో పెంచి పెద్ద చేస్తాడు. అర్జున్‌ ఎన్ని ఉద్యోగాలు వచ్చిన రిజెక్ట్ చేస్తూ దేశ రక్షణలో భాగం కావాలనుకుంటాడు. అన్ని బ్యూరోలకు 174 అప్లికేషన్స్‌ పెట్టుకున్నా ఒక్కదానికీ రెస్పాన్స్‌ రాదు. ఫైనల్‌గా తాను మాజీ ‘రా’ అధికారి రఘువీర్‌ కొడుకుని అని మెన్షన్‌ చేసి అప్లై చేస్తాడు. త్రినేత్ర అనే స్పెషల్ టీం కోసం అర్జున్‌ను సెలెక్ట్ చేస్తారు. కానీ అర్జున్‌ అపాయింట్‌ అయిన రోజే త్రినేత్ర సృష్టి కర్త ఆచారి మీద ఎటాక్‌ అవుతుంది. ఎటాక్‌లో ఆచారితో పాటు కొంత మంది ఆఫీసర్స్‌ కూడా చనిపోతారు. ఎటాక్ చేసిన వ్యక్తి అర్జున్‌ బైక్‌ మీద రావటం, ఆచారిని చంపిన తుపాకి మీద అర్జున్‌ వేలి ముద్రలు ఉండటంతో ప్రభుత్వం అర్జున్ ని అనుమానిస్తుంది. అర్జున్‌ తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఆచారి మీద ఎటాక్ చేసింది ఎవరు.? అర్జున్‌ ఈ మిస్టరీని ఎలా చేదించాడు.? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

తెలుగు తెర మీద బాండ్ తరహా చిత్రాలు ఈ జనరేషన్‌కు పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. అలాంటి కాన్సెప్ట్‌తో కథను తయారు చేసుకున్న అడివి శేష్‌ బాండ్ సినిమాలను తెరకెక్కించగలమని మరోసారి ప్రూవ్‌ చేసాడు. ఈ కథను కన్ఫ్యూజన్‌ లేకుండా దర్శకుడు శశి కిరణ్ తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే రొమాంటిక్ సీన్స్‌ కాస్త బోరింగ్ గా అనిపించినా సెకండ్‌ హాఫ్‌లో ఆ సీన్స్‌కు ఉన్న కనెక్షన్‌ చూసిన తరువాత ఓకె అనిపిస్తాయి. అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ ఎలా నిర్వహిస్తారు, వారి సెలక్షన్‌ ఎలా జరుగుతుంది, ఎలా ట్రైన్‌ చేస్తారు లాంటి అంశాలు ఆసక్తికరంగా తెరకెక్కించారు. విశ్రాంతికి ముందొచ్చే స‌న్నివేశాలు, వేసిన చిక్కుముడులు బాగున్నాయి. ప్ర‌ధ‌మార్థంలో క‌నిపించిన బిగి ద్వితీయార్థం మొద‌ల‌య్యేస‌రికి కాస్త స‌డ‌లుతుంది. జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌ని ప్ర‌మోష‌న్ల‌లో ఎక్క‌డా వాడ‌కుండా జ‌గ్ర‌త్త‌ప‌డ్డారు. అది కాస్త స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్‌గా మారింది. ప‌తాక స‌న్నివేశాల్లో ట్విస్టుకి ఆ పాత్ర ఉప‌యోగ‌ప‌డింది. కొన్ని చోట్ల ‘బోర్న్ ఐడెంటిటీ, కింగ్స్‌మెన్‌, షూట‌ర్’ సినిమాల ఛాయ‌లు కనిపిస్తుంటాయి. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌కు కావాల్సిన ఇంటెన్సిటీని తీసుకురావటంలో కెమెరామెన్‌ శానెల్‌ డియో, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ విజయం సాధించారు.

ఎవరెలా..

సినిమా అంతా అడివి శేష్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇండియన్‌ బాండ్‌లా అడవి శేష్‌ అద్బుతంగా నటించాడు. తనే రాసుకున్న కథా కథనాలు కావటంతో అవకాశం ఉన్న ప్రతీ చోట తనని బాగా ఎలివేట్ చేసుకున్నాడు. సినిమాలో జగపతిబాబు ఎంట్రీ ఆడియన్స్‌ కు షాక్‌ ఇస్తుంది. కరుడుగట్టిన తీవ్రవాదిగా ఆయన నటన, లుక్స్‌ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. అక్కినేని వారసురాలు సుప్రియ రీఎంట్రీకి పర్ఫెక్ట్ క్యారెక్టర్‌ను ఎంచుకున్నారు. త్రినేత్ర టీం ఆఫీసర్‌ పాత్రలో ఆమె నెగెటివ్‌ షేడ్స్‌ ను బాగా చూపించారు. తొలి అవకాశంతోనే శోభితా దూళిపాలకు మంచి పాత్ర దక్కింది. గ్లామర్‌ షోతో పాటు నటిగానూ ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. మరో కీలక పాత్రలో వెన్నెల కిశోర్ ఆకట్టుకున్నాడు. తాను సీరియస్‌గా ఉంటూనే కామెడీ పండించాడు. ఇతర పాత్రల్లో ప్రకాష్‌ రాజ్‌, మధుశాలిని, అనీష్ కురివిల్లా తదితరులు పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

ఫైనల్ గా..

కొత్త త‌ర‌హా క‌థ‌లు కోరుకునేవాళ్ళు, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చూడాల‌నుకునేవారికి ‘గూఢ‌చారి’ న‌చ్చుతాడు.