కదిలిన డొంక ..తెలంగాణ ఎంసెట్ లీకేజీలో ‘శ్రీచైతన్య’

341

తెలంగాణలో 2016లో సంచలనం సృష్టించిన ఎంసెట్ మెడికల్ పేపర్ లీకేజీ కేసులో శ్రీచైతన్య లింక్ బయటకు వచ్చింది. శ్రీచైతన్య కాలేజీలకు డీన్ గా వ్యవహరిస్తున్న వాసుబాబు అనే వ్యక్తిని తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసారు. వాసుబాబుతో పాటు ఆయన నియమించుకున్న ఏజెంట్ శివనారాయణ కూడా సీఐడీ పోలీసులకు చిక్కారు.

ఎంసెట్ మెడికల్ పేపర్ లీకేజీ కేసులో డాక్టర్ ధనుంజయ్ ఠాకూర్, డాక్టర్ సందీప్ కూమార్ అనే ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు గతంలోనే అరెస్ట్ చేసారు. వీరి కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులు శ్రీచైతన్య లింక్‌ను కనిపెట్టారు. శ్రీచైతన్యకు చెందిన ఆరుగురు విద్యార్థులతో వాసుబాబు భువనేశ్వర్ లో క్యాంప్ నిర్వహించారు. పేపర్ లీకేజీకి సంబంధించి ప్రధాన నిందితులతో పలుమార్లు చర్చలు జరిపారు. హైదరాబాద్‌లోనే ఈ సమావేశాలు జరిగినట్లు పోలీసులు తేల్చారు.

భువనేశ్వర్‌లో వీరు నిర్వహించిన క్యాంపులో ఉన్న ఆరుగురిలో ముగ్గురు విద్యార్థులకి మెడికల్‌లో మంచి ర్యాంకులు వచ్చాయి. ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.30 లక్షల చొప్పున ఆరుగురు విద్యార్థులను నుండి సుమారు రెండు కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. 2016లో మొత్తం రెండు సార్లు ఎంసెట్ మెడికల్ పేపర్లు తెలంగాణలో లీకయినట్లు సీఐడీ గుర్తించింది.  మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

ర్యాంకులు వచ్చిన వారి వ్యవహారంపై విచారణ జరపగా గుట్టు మొత్తం బయటపడింది. ఇతర రాష్ట్రాల్లో క్యాంపులు నిర్వహించి పేపర్లను ప్రాక్టీస్ చేయించి మరీ ఎగ్జామ్ హాల్స్ వద్ద వదిలి పెట్టేవారని సీఐడీగుట్టు తేల్చింది. ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్‌లోనే పేపర్ లీకయినట్లు గుర్తించారు. తొలిసారి శ్రీచైతన్య కాలేజీ డీన్ వ్యవహారం బయటకు వచ్చింది. ఆరు కాలేజీలకు ఇన్చార్జ్ గా వ్యవహరిస్తున్న వాసుబాబు విషయాన్ని మరింత లోతుగా పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది. ఇప్పుడీ కేసు శ్రీచైతన్య మెడకే చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది.