రివ్యూ : ఇది గిఫ్ట్ కాదు ప్రేక్షకులపై ‘రివెంజ్’

369

మాస్ మహారాజా రవితేజ, ఎంతో కాలంగా సక్సెస్‌ లేని శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ప్రేక్షకుల మున్డుడ్కు వచ్చింది. ఈ సినిమాతో చాలా కాలం తరువాత ఇలియానా టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇచ్చింది. హీరో, హీరోయిన్‌, దర్శకుడు ఆశలు పెట్టుకున్న ఈ సినిమా అంచనాలను అందుకుందా..? చూద్దాం.

కథేమంటే..

న్యూయార్క్‌లో ‘ఫిడో ఫార్మా’ పేరుతో కంపెనీని స్థాపించి మిలియనీర్స్‌గా ఎదిగిన ప్రవాస భారతీయులు ఆనంద్‌ ప్రసాద్‌, సంజయ్‌ మిత్రా ఇద్దరూ చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితులు. ఆనంద్‌ ప్రసాద్‌ కొడుకు అమర్‌ (రవితేజ)ను, సంజయ్‌ మిత్రా కూతురు ఐశ్వర్య (ఇలియానా)కు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. కంపెనీలో ఉద్యోగస్తులుగా ఉన్న అరోరా (తరుణ్‌ అరోరా), సబూ మీనన్‌ (ఆదిత్య మీనన్‌), విక్రమ్‌ తల్వార్‌ (విక్రమ్‌జీత్‌) , రాజ్‌ వీర్‌లను కంపెనీలో 20 శాతం షేర్స్‌ ఇచ్చి భాగస్వాములుగా చేసుకుంటారు. కానీ ఆ నలుగురూ పూర్తి కంపెనీని చేజిక్కించుకోవాలని ఆనంద్‌ ప్రసాద్‌, సంజయ్‌ మిత్రాల కుటుంబాలను పూర్తిగా అంతం చేయడానికి ప్లాన్ చేస్తారు. నమ్మకస్తుడైన జలాల్‌ అక్బర్‌ (షాయాజీ షిండే) అమర్‌, ఐశ్వర్యలను కాపాడతాడు. ఐశ్వర్యను చంపిన హంతకుడిని చంపిన నేరంలో అమర్ జైలుకి వెళతాడు. జైలు నుండి 14 ఏళ్ళ తరువాత తిరిగి వచ్చిన అమర్ ఆ నలుగురిపై ఎలా పగ తీర్చుకున్నాడు.? ఐశ్వర్య బ్రతికే ఉందని అమర్ కి తెలిసిందా? ఇద్దరూ తిరిగి ఎలా కలుసుకున్నారు? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

క‌థానాయ‌కుడికి ఓ బ‌ల‌మైన ప్ర‌తీకారం, అంతే బ‌ల‌మైన మాన‌సిక రుగ్మ‌త ఉంటుంది. బ‌ల‌హీన‌త‌ల్ని కప్పిపుచ్చుతూ ప్ర‌తీకారం తీర్చుకోవటం అనే పాయింట్ దగ్గర రవితేజ, మైత్రి మూవీస్ లాక్ అయ్యి ఉంటారు. అయితే దర్శకుడు మాత్రం పాయింట్‌లో ఉన్న ఆసక్తిని చెరిపేస్తూ సినిమాని ఎలా తీయకూడదో అలానే తీసాడు. ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జ‌రిగి ఉంటుందో, అమ‌ర్ ఎవ‌రో, అక్బ‌ర్ ఎవ‌రో, ఆంటోనీ ఎవ‌రో, అస‌లు ఇలియానా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తుంటో తెలిసిపోతున్నా దర్శకుడు మాత్రం ఆ పాయింట్‌ చుట్టూతా తిరిగాడు. మ‌ధ్య‌లో క‌ట్ షాట్లు, ఫ్లాష్ బ్యాక్ సీన్లూ వేస్తూ, ఎఫ్బీఐ ఇన్విస్టిగేష‌న్ చేయిస్తూ టార్చర్ చేసాడు. చిక్కు ముడి ముందే విప్పేసి అస‌లు ఈ చిక్కు ముడి ఎలా ప‌డిందని చూపించే స్క్రీన్ ప్లే ప్రేక్షకులపై పగ తీర్చుకున్నాడు. మరొకం విచిత్రం హీరో, హీరోయిన్లు ఇద్దరికీ మానసిక వ్యాధులు ఉండటం. హీరో పాత్ర అయితే పీక్స్. అద్దం ప‌గిలితే ‘అక్బర్’ బాంబు పేలితే ‘అమర్’, శబ్దం వినిపిస్తే ‘ఆంటోనీ’ ఒక పాత్ర‌లోంచి మ‌రో పాత్ర‌లోకి జంప్ అయిపోవ‌డం అంత సిల్లీగా తీసారు. రివెంజ్ డ్రామాకు అమెరికా నేప‌థ్యం, స్ప్రిట్ ప‌ర్స‌నాలిటీ జోడించి త‌న‌దైన స్టైల్‌లో తీయాల‌ని ‘వాటా’ లాంటి ఎపిసోడ్లు పేర్చుకుంటూ వెళ్ళాడు. క్రికెట్ బెట్టింగ్ సీన్‌ అయితే తేలిపోయింది. అయిపోయిన మ్యాచ్‌కి ఎవ‌డైనా బెట్టింగ్ వేసుకుంటాడా? తెర‌పై మ్యాచ్ చూపించాల‌నుకున్న‌ప్పుడు ఛాన‌ల్ లోగో కింద‌ ‘లైవ్’ ఉందో లేదో కూడా చూసుకోరా??

ఎవరెలా..

మూడు పాత్ర‌లూ చేసింది ఒక్క‌డే అని తెలిసిపోయిన‌ప్పుడు రవితేజను మూడు పాత్రల్లో చూస్తుంటే వెరైటీ క‌నిపించ‌దు. చాలా రోజులుగా సరైన సక్సెస్‌ లేక ఇబ్బందుల్లో ఉన్న శ్రీను వైట్ల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయాడు. ఇలియాన బొద్దుగా కనిపించినా కొత్తగా ఉంది. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని మెప్పిస్తుంది. తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్‌, విక్రమ్‌జీత్‌ స్టైలిష్‌ విలన్లుగా కనిపించారు. షాయాజీ షిండేకు మంచి పాత్ర దక్కింది. వెన్నెల కిశోర్‌, శ్రీనివాస్‌ రెడ్, సునీల్‌, సత్య, రఘుబాబు, గిరి నవ్వించే ప్రయత్నం చేసారు. ఎఫ్బీఐ అధికారిగా అభిమన్యు సింగ్‌ ఫరవాలేదనిపించాడు.

ఫైనల్ గా..

సినిమా మొదట్లో ‘న‌మ్మ‌కం’ గురించి గొప్పగా చెప్పిన శ్రీను వైట్ల తనపై రవితేజ పెట్టుకున్న నమ్మకాన్ని పిసరంత కూడా నిలబెట్టుకోలేదు.