ఆగస్టు 1 నుండి థియేటర్లలో ఎమ్మార్పీ ధరలకే తినొచ్చు

431

సినిమా థియేటర్లలో కోకా కోలా, పెప్సీ, పాప్ కార్న్, శాండ్ విచ్, బర్గర్, వాటర్ బాటిల్ ఏది కొనాలన్నా బయట మార్కెట్ ధరలకు రెండురెట్లు, మూడురెట్లు ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. ఇకపై సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో తినుబండారాలు, శీతల పానీయాలు అన్నిటినీ ఎమ్మార్ఫీ ధరలకు అమ్మాలని, లేనిపక్షంలో ఎక్కువ ధరలకు విక్రయించే థియేటర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర తూనికల కొలతల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని విధివిధానాలు రూపొందించారు.

అవేమిటో చూద్దాం..

ఫుడ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ థియేటర్లలో అమ్మే ప్రతి వస్తువుపై బరువు, తయారు చేసిన తేదీ, ఎప్పటివరకూ నిల్వ ఉంటుంది అనే అంశాలతో పాటు ఎంఆర్‌పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్‌ ఉండాలి. ఎంఆర్‌పీ మారితే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలి. థియేటర్లలో సేమ్ బ్రాండ్‌ ఫుడ్ ఐటమ్స్ కాకుండా వివిధ బ్రాండ్స్ అందుబాటులో ఉంచాలి. ప్యాకేజ్డ్‌ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు ఫుల్ అడ్రస్, ఐటమ్ నేమ్ అన్నీ ఉండాలి. ప్రతి వస్తువుని ఎంఆర్‌పీ ధరలకు విక్రయించాలి.

ఆగస్టు 1వ తేదీ ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎంఆర్‌పీ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువకు అమ్మినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారికి మొదటిసారి పాతికవేలు జరిమానా విధిస్తారు. రెండోసారి రూ.50 వేలు, మూడోసారి లక్ష రూపాయలతో పాటు ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తారు. తూనికల కొలతల శాఖ కమీషనర్ అకున్ సబర్వాల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు.

ఏదైనా థియేటర్లో ఎమ్మార్ఫీ ధర కంటే ఎక్కువకు విక్రయిస్తున్నారని ప్రేక్షకుల దృష్టికి వస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌ 180042500333 కి కాల్ చేసి, లేదా 7330774444 నంబర్ కు వాట్సాప్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.