జట్టు కట్టారే గాని ..సిగపట్లు పడుతున్నారు

162

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సిగపట్లు పడుతున్నాయి. కూఅటమి తరపున ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసి వారం దాటుతున్నా మంత్రి పదవులపై రెండు పార్టీలు నిర్ణయించుకోలేక ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు.

తమకు రెండు ఉప ముఖ్యమంత్రులు ఉండాలని కాంగ్రెస్ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. అందుకు కుమారస్వామి నిరాకరించడంతో ఒక ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకుంది. ఇప్పుడు మలి దఫా చర్చల్లో అదే ప్రధానాంశమైంది. కాంగ్రెస్ నేత శివకుమార్ కు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుపడుతోంది. కానీ కుమారస్వామి మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

శివకుమార్ కు డిప్యూటీ సిఎం ఇవ్వలేని పక్షంలో లింగాయత్ సామాజికవర్గానికి చెందిన నేతకు కేటాయించాలని కాంగ్రెస్ ప్రతిపాదించింది. మరో వైపు ఆర్థిక మంత్రిత్వ శాఖ కోసం రెండు పార్టీలు టగ్ పోటీపడుతున్నాయి. ఆర్థిక శాఖ తమకే కావాలని కాంగ్రెస్ కోరుతుంటే సీఎంగా ఆర్థిక శాఖను కూడా తానే నిర్వహిస్తానని కుమారస్వామి తేల్చి చెబుతున్నారు. ఆర్థిక శాఖతో పాటు రెవెన్యూ, ప్రజా పనుల శాఖ ఇప్పుడు రెండు పార్టీల మధ్య వివాదానికి కారణమవుతున్నాయి.

రెండో ఉప ముఖ్యమంత్రి పదవి, ఆర్థిక శాఖను అప్పగిస్తే మిగతా రెండు శాఖలు వదులుకునేందుకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ పెట్టిన ప్రతిపాదనను అంగీకరించటానికి కుమారస్వామి సిద్ధంగా లేరు. సీఎం పదవిని తాము వదులుకున్న విషయాన్నిగుర్తు చేస్తూ బదులుగా ఆర్థిక, రెవెన్యూ, ప్రజాపనులు, గ్రామీణాభివృద్ధి, బెంగళూరు పట్టణాభివృద్ధి, విద్యుత్, ఆరోగ్యం, గనులు లాంటి కీలక శాఖలు తమ వద్దనే ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

కర్ణాటక కేబినెట్లో మొత్తం 34 మంది మంత్రులకు గాను 22 మంత్రి పదవులు కాంగ్రెస్‌కు ఇస్తున్నారు. కానీ కీలకమైన శాఖలను మాత్రం వదులుకునేందుకు సిద్దపడటం లేదు. శాఖల విషయంలోనే తేల్చుకోలేకపోతున్న పార్టీలు పాలనలో వచ్చే సమస్యలపై సమన్వయానికి ఎలా వస్తారనేది సమస్యగా మారింది. జేడీఎస్ ను డిక్టేట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తే  కుమారస్వామి ఎదురు తిరుగుతారు. ఆ కుమ్ములాటను చూస్తూ భాజపా ఎటువంటి అడుగులు వేస్తుందో చూడాలి.