ఇంత హడావుడిగా తేల్చేయాల్సిన అవసరం ఏముంది.?

123

ఇటీవల జరిగిన రెండు ఆత్మహత్యలు సంచలనం సృష్టించాయి. ఒకటి హైదరాబాద్ ఫిలిం నగర్ లో బ్యూటీషియన్ శిరీష అలియాస్ విజయలక్ష్మిది కాగా రెండోది కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకరరెడ్డిది. ఈ రెండు ఆత్మహత్యలకు వెనువెంటనే ముడిపెట్టారు పోలీసులు. దీనిపై శరవేగంగా విచారణ జరిపి వివరాలు పూసగుచ్చినట్టు వెల్లడించారు. కనీసమైన సందేహాలు గాని తేలవలసిన విషయాలు గాని అసలు లేవన్నట్టు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ప్రకటించారు.

శిరీషది ఆత్మహత్య అని పోలీసులు తేల్చేసారు. ఒక వేళ ఇదంతా నిజమే అనుకున్నా ప్రధాన ఆధారం మాత్రం నిందితులుగా వున్న రాజీవ్‌, శ్రావణ్‌ల వాంగ్మూలాలే. వాళ్ళు అన్నీ నిజాలు చెప్తున్నారని ఏంటి ఆధారం.? ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నం చేయటంతో మానసికంగా క్రుంగిపోయిన శిరీష ఆత్మహత్య చేసుకుందంటున్నారు. చనిపోయిన వాడిపై ఎన్ని నేరాలు మోపినా ప్రాబ్లెం ఉండదుగా. మరో వైపు ఫోన్‌ కాల్‌ డేటా కూడా ఉందంటున్నారు. వాస్తవంగా తేలవలసింది ప్రభాకరరెడ్డి మరణం సంగతి. ఒకే పోలీసు స్టేషన్‌లో రెండవసారి ఆత్మహత్య ఇది. ఇప్పటికి పోలీసులు, హౌం గార్డులు వగైరా మొత్తం పదిమంది వరకూ తెలంగాణలో ఇలాగే మరణించారు. ఎక్కువ సందర్భాల్లో కుటుంబ సభ్యులు పై అధికారుల వేధింపులు జరిగాయని ఆరోపించారు. శిరీష తలిదండ్రులు అత్తమామలు కూడా పోలీసుల కథనాలను ఆమోదించడం లేదు.

నిశితంగా పరిశీలిస్తే ఈ కథనాల్లో అనేక లొసుగులు కూడా వున్నాయి. చనిపోయిన వారి ప్రవర్తనను కారణంగా చెప్పి చావుల తీవ్రతను తగ్గించడం ఏ విధంగా సమంజసం? వారు ఆ కారణంగానే చనిపోయారా? లేక ఆ కారణంతో మరెవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారా లోతుగా దర్యాప్తు చేయవలసిన అవసరం వుంటుంది. కాని అత్యున్నతాధికారులే ముందస్తుగా కేసు మూసేసినట్టు మాట్లాడిన తర్వాత ఎవరు ముందుకొస్తారు? ఏ ఆ ధారాలు తీసుకొస్తారు? నయీం కేసు గాని, భూ కుంభకోణాలు గాని ఇప్పుడు ఈ ఆత్మహత్యలు గాని అంతా క్షణాలమీద ప్రకటించేయవలసిన అవసరం ఏమిటి?