కాంగ్రెస్ వ్యూహాలు ఇలా ఉన్నాయేమిటో.?

492

తెలంగాణలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నీ, తెరాస పాల‌న‌పై ప్ర‌జ‌లు విసుగుచెంది ఉన్నారంటూ కాంగ్రెస్ నేత‌లు ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు చేస్తుంటారు. అయితే, ముందుగా సొంత పార్టీలో లోపాల‌ను స‌రిదిద్దుకోకుండా తెరాస ఎదుర్కొనే వ్యూహాల‌ను ర‌చించేస్తున్నారు. ఇంకోప‌క్క రాష్ట్రంలో సోలోగా ఎదిగేందుకు సిద్ధ‌మౌతున్న భాజ‌పా కొత్త స‌వాలుగా మారింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ ఒక వ్యూహంతో సిద్ధ‌మైంది.

అదేమంటే కాంగ్రెస్ పార్టీలోకి నాయ‌కుల‌ను ఆక‌ర్షించ‌డం. కాంగ్రెస్ లోకి పెద్ద సంఖ్య‌లో నాయ‌కులు చేర‌బోతున్నారంటూ టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క జోస్యం చెప్పారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎనిమిది మంత్రులు, మ‌రో 15 మంది ఎమ్మెల్యేలు త‌మ‌కు ట‌చ్ లో ఉన్నారని చెప్పారు. స‌రైన స‌మ‌యం చూసుకుని వారు కాంగ్రెస్ లోకి వ‌చ్చేస్తార‌ని ధీమా వ్య‌క్తం చేసారు. గ‌తంలో కాంగ్రెస్ నుంచి తెరాస‌కు వెళ్ళిన నాయ‌కులు త‌మ‌కు కోవ‌ర్టులుగా ప‌నిచేస్తున్నార‌నీ, వారు కూడా స‌రైన స‌మ‌యం కోసం చూస్తున్నార‌నీ, అయితే వ‌చ్చిన‌వారంద‌రినీ పార్టీలోకి తీసుకోవాలా వ‌ద్దా అనేది అధిష్ఠానం ఖ‌రారు చేస్తుంద‌ని చెప్పారు. ఇంతకీ కాంగ్రెస్ వైపు ఇంత మోజుగా తెరాస నేత‌లు ఎందుకు చూస్తున్నార‌ని అడిగితే.. 2019లో తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంద‌నీ, అందుకే నాయ‌కులంతా త‌మ‌వైపు మొగ్గుతున్నార‌న్నారు.

వాస్త‌వానికి ఇది తెర వెన‌క ఉండాల్సిన వ్యూహం. ప్రెస్ మీట్ పెట్టేసి చాటింపు వేసుకునే ఘ‌న‌కార్యం కాదు. ఒక‌వేళ కాంగ్రెస్ లో చేరేందుకు ఎనిమిది మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటే వారిని ప్ర‌భుత్వం నుంచి ఒకేసారి బ‌య‌ట‌కి తీసుకొచ్చి ఝ‌ల‌క్ ఇవ్వాలి. అంత‌వ‌ర‌కూ ఇలాంటి ప్లానింగ్ లో కాంగ్రెస్ ఉంద‌నే వాస‌న కూడా బ‌య‌ట‌కి పొక్క‌నీయ‌కూడ‌దు! అప్పుడ‌ది స‌రైన వ్యూహం అవుతుంది.