మైకులు విసిరేసి..పత్రాలు చింపేసి ..ప్రజాస్వామ్యం అంటే ఎలా.?

99
తెలంగాణ‌ అసెంబ్లీ స‌మావేశాల్లో తీవ్ర గంద‌రగోళం చోటు చేసుకుంది. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప్ర‌సంగాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా త‌ప్పుబ‌డుతూ పోడియం ముందుకు దూసుకెళ్ళే ప్ర‌య‌త్నం చేసారు. దీంతో పెద్ద సంఖ్య‌లో మార్ష‌ల్స్ స‌భ‌లోకి వ‌చ్చారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో రైతుల స‌మ‌స్య ముచ్చ‌టే లేదంటూ నిర‌సన తెలుపుతూ ప్ర‌సంగ ప‌త్రాల‌ను గీతారెడ్డి చింపేసారు. ఓప‌క్క గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగిస్తుండ‌గానే, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి స్పందిస్తూ హెడ్ ఫోన్స్ తీసి విసిరారు. అది మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్ కి త‌గిలింది. దాంతో ఆయ‌న కంటికి స్వ‌ల్ప గాయమై, వెంట‌నే స‌రోజినీ కంటి ఆసుప‌త్రికి త‌ర‌లించారు.
ఈ ఘ‌ట‌న‌పై అధికార పార్టీ నేత‌లు తీవ్రంగా మండిప‌డుతున్నారు. అయితే, ఇదే అంశ‌మై మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చారు కోమ‌టిరెడ్డి. నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న క్ర‌మంలో సిబ్బంది త‌న‌ను అడ్డ‌గించార‌నీ, త‌న కాలికి కూడా గాయ‌మైంద‌నీ, ఎక్స్ రే తీయాల‌ని వైద్యులు చెబుతున్నార‌న్నారు. రైతుల మ‌ద్ద‌తు ధ‌ర‌పైనే త‌న పోరాటమ‌నీ, దానికి సంబంధించి పోడియం ద‌గ్గ‌ర‌కి పోవాల‌ని అనుకున్నానన్నారు. ఇదే త‌ర‌హాలో పార్ల‌మెంటులో ప‌ది రోజుల నుంచీ తెరాస ఎంపీలు పోడియం దగ్గ‌ర‌కి ఎందుకెళ్తున్నార‌ని ప్ర‌శ్నించారు.? ప‌్ర‌జాస్వామ్యంలో పోడియం ద‌గ్గ‌ర‌కి వెళ్లి నిర‌స‌న తెలిపే హ‌క్కు అందరికీ ఉంటుంద‌న్నారు. పార్ల‌మెంటులో వారు పోడియం ద‌గ్గ‌ర‌కి పోతున్న‌ప్పుడు, ఇక్క‌డ మ‌మ్మ‌ల్ని ఎందుకు అడ్డుకుంటున్నార‌న్నారు. గ‌తంలో బ‌డ్జెట్ ప‌త్రాల‌తో స్పీక‌ర్ ను కొట్టిన సంద‌ర్భాలున్నాయ‌నీ, ఇప్పుడు మంత్రిగా ఉన్న‌ హ‌రీష్ రావు స్పీక‌ర్ పై దాడి చేసార‌న్నారు. కానీ, తాము ఆ స్థాయిలో చేయ‌లేద‌నీ, పోడియం ద‌గ్గ‌ర‌కి పోనియ్య‌నందుకు నిర‌స‌న తెలిపామ‌న్నారు.
ప్ర‌భుత్వ విధానాల‌పై నిర‌స‌న తెలపడం ఖచ్చితంగా ప్ర‌తిప‌క్షాల హ‌క్కు. కానీ, స్పీక‌ర్ పోడియం మీదికి దూసుకెళ్ళడ‌మూ, మైకులు విరిచేసి విసిరెయ్య‌డం, ప్ర‌సంగ పత్రాల‌ను చింపేసి స్పీక‌ర్ పై విస‌ర‌డం లాంటివ‌న్నీ ఆ హ‌క్కులో లేవు. మీరు మైకు ఎందుకు విసిరారో చెప్పండ‌య్యా అంటే గ‌తంలో హ‌రీష్ రావు ఇలానే చేయ‌లేదా, ఇప్పుడు పార్ల‌మెంటులో తెరాస ఎంపీలు పోడియం వ‌ద్దకు ఎందుకెళ్తున్నారు అంటూ అడగటం హాస్యాస్పదం. చ‌ట్ట‌స‌భ‌ల్లో నిర‌స‌న తెలిపే విధానంలో హుందాత‌నం ఉండాలే కానీ ఇష్టానుసారం ప్ర‌వ‌ర్తించేసి ప్ర‌జాస్వామ్యం అంటే ఎలా..?