తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాంగ్రెస్ హయాంలోనే అయినా తెలంగాణ ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఆంధ్రాలో పార్టీ భవిష్యత్తుని పణంగా పెట్టి మరీ రాష్ట్రం ఇచ్చామని గత ఎన్నికల్లో బలంగా ప్రచారం చేసుకోలేకపోవటంతో తెలంగాణలో కూడా అధికారం దక్కలేదు. అయితే, వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇదే సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవచ్చనే వ్యూహంలో ఆ పార్టీ ఉందనిపిస్తోంది. బస్సుయాత్ర ద్వారా అదే సెంటిమెంట్ ను మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ నేతల బస్సుయాత్ర చేవెళ్ళ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా జరిగిన సభలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను సోనియా గాంధీ అర్థం చేసుకుని, ఆంధ్రాలో 25 ఎంపీ స్థానాలు త్యాగం చేసి మరీ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడి పేద ప్రజలకు న్యాయం జరుగుతుందనీ, రైతుల జీవితాలు మారుతాయనీ, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయని నాడు కాంగ్రెస్ భావించింది. కానీ, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ప్రజలకు చేసిందేం లేదన్నారు.
కేసీఆర్ అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేసారని గుర్తుచేసారు. వాస్తవానికి ఊరికి ఒక ఉద్యోగం కూడా కనిపించడం లేదనీ, కానీ ఆయన కుటుంబంలో నలుగురు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేసారు. ప్రజలకు మాయమాటలు చెప్పి మోసగించారనీ, తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. నేరెళ్ళ ఘటనతో దళితులకు తీవ్ర అవమానం జరిగిందన్నారు. బీసీలపై కపట ప్రేమ ప్రదర్శిస్తూ నాలుగేళ్ళ తరువాత వారి కోసం పథకాలు తెస్తున్నామంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ బస్సుయాత్రలో కేసీఆర్ పై ఎప్పుడూ చేస్తున్న విమర్శలే చేస్తున్నారు, కాబట్టి వాటికి ప్రజల నుంచి అనూహ్య స్పందన అంటే కాస్త అనుమానమే. కానీ, తెలంగాణ ఇచ్చిన ఘనత తమదే అని బలంగా ప్రచారం చేసుకుంటే అది పార్టీకి కొంతైనా మేలు చేసే అంశం కావొచ్చు. కనీసం ఈ ఒక్క పాయింట్ ను ఇప్పట్నుంచీ బలంగా ప్రచారం చేసుకుంటూ పోతే ఎన్నికల నాటికైనా కొంత ప్రయోజనం ఉండోచ్చు. మరి యాత్ర చివరి వరకూ ఇదే కొనసాగిస్తారా.? చూడాలి.