కర్ణాటకలో భారతీయ జనతాపార్టీ ఎదురీది మరీ విజయం సాధించింది. మొత్తం 224 స్థానాల్లో 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మెజార్టీకి అవసరమైన 113కు దగ్గరగా వెళ్ళిన భాజపా చివరికి 104 స్థానాలతో సరిపెట్టుకుంది. సెంట్రల్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలో భాజపా ఏకపక్ష విజయాలు నమోదు చేసింది.
ఉత్కంఠతో ఎదురు చూసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాల్లో భాజపా-104, కాంగ్రెస్-78, జేడీఎస్-37, బీఎస్పీ-1, ఇతరులు-2 సీట్లు సాధించారు. హంగ్ నేపథ్యంలో రాజ్‌భవన్ వద్ద రసవత్తరమైన రాజకీయాలు కొనసాగాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఛాన్స్ ఇవ్వాలంటూ భాజపా సీఎం అభ్యర్థి యాడ్యూరప్ప, కాంగ్రెస్ మద్ధతుతో జేడీఎస్‌లు గవర్నర్‌ను కలిసారు. అయితే ఏ విషయం అన్నదానిపై ఇరు వర్గాలకు గవర్నర్ స్పష్టత ఇవ్వన్నట్లు తెలుస్తోంది.
ఎవరికి వారే ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. జేడీఎస్ వర్గపోరును తనకు అనుకూలంగా మార్చుకుని భాజపా అధికారంలోకి రావాలని చూస్తుండగా, తమకు అధికారం దక్కకపోయినా ఫర్వాలేదుగానీ భాజపాని అధికారానికి దూరం చేయాలని కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తోంది. కర్ణాటక ఫలితాలు ఖచ్చితంగా ఊహించనివే. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ హంగ్ అసెంబ్లీని అంచనా వేసాయి. కొన్ని మీడియా సంస్థలు భాజపాకి ఏకపక్ష విజయాన్ని అంచనా వేసాయి. మరికొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తేల్చాయి.
అన్నింటినీ క్రోడీకరిస్తే హంగ్ వస్తుందని జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని తేల్చారు. కౌంటింగ్ ట్రెండ్స్‌లో కూడా చివరికి అదే తేలింది. జేడీఎస్ కింగ్ మేకర్ నుండి ఒక్కసారిగా కింగ్ గా మారింది. కాంగ్రెస్, భాజపాల మధ్య మొదటి నుంచి హోరాహోరీ ఫలితాలొచ్చాయి. తర్వాత ఈవీఎంల ఓట్లన్నీ భాజపాకి సపోర్ట్‌గా మారిపోయాయి. తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో భాజపాకి నిరాశజనకమైన ఫలితాలే వచ్చాయి. బెంగళూరులో ఈసారి అక్కడ కాంగ్రెస్ కు మంచి ఫలితాలొచ్చాయి.