ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎలా నడిపిస్తారు.?

65
ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలని పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టినా మోడీ స‌ర్కారులో ఇసుమంతైనా చ‌ల‌నం రాలేదు. ఢిల్లీలో దీక్ష‌లూ, నిర‌స‌న‌లు కూడా అయిపోయాయి. ఇప్పుడు ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం రాష్ట్రానికి చేరుకుంది. ప్ర‌తిప‌క్షాలు బంద్ పిలుపునిచ్చాయి. అధికార పార్టీ తెదేపా కూడా ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ సైకిల్ ర్యాలీలు, ధ‌ర్నాలు, విన‌తిప‌త్రాలు అంటూ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించేసింది.
నెలాఖ‌రు త‌రువాత ప‌రిస్థితి ఏంట‌నేదే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ముందు ఉన్న కొత్త స‌వాల్. ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది స‌మ‌యం ఉన్న తరుణంలో ఏడాది పాటూ ప్ర‌త్యేక హోదా అంశంపైనే విప‌క్షాలు ఉద్య‌మించే అవ‌కాశం ఉంటుంది. దీన్నే ఎన్నిక‌ల అజెండా అంశంగా మార్చేసుకుంటాయి. ప్ర‌త్యేక హోదా ఎవ‌రిస్తే వారితోనే పొత్తు ఉంటుంద‌ని ఇప్ప‌టికే వైకాపా చాలాసార్లు స్ప‌ష్టం చేసింది. ఇక‌, జ‌న‌సేన కూడా ఇదే ఉద్య‌మాన్ని ప్ర‌ధానాంశంగా తీసుకుని మరో ఏడాదిపాటూ వామ‌ప‌క్షాల‌తో క‌లిసి కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంద‌నే చెప్పాలి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇత‌ర పార్టీల త‌ర‌హాలోనే తెదేపా ఉద్య‌మాల‌తోనే కాల‌క్షేపం చేస్తుందా..? అధికార పార్టీ నేత‌లు ఇలా నిత్యం రోడ్ల మీదికి వ‌స్తుంటే ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సంకేతాలు వెళ్తాయ‌ని తెదేపాలో చ‌ర్చ‌ జరుగుతోంది. దాదాపు ఏడాదిపాటు ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని ఎలా న‌డిపించాల‌నే అంశంపై మ‌ల్ల‌గుల్లాలు మొద‌లైన‌ట్టు స‌మాచారం. ఇది కేంద్రం తీర్చాల్సిన స‌మ‌స్య కాబ‌ట్టి, ఇదే మాట‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ళడంలో త‌ప్పేముంద‌ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌. హోదా ఉద్య‌మాన్ని క్షేత్ర‌స్థాయిలో తీవ్రంగా ఉంచితే స‌రిపోతుంద‌నీ, కేడ‌ర్ తో ఉద్య‌మాన్ని న‌డిపించం వ‌ల్ల పార్టీకి కూడా ప్ల‌స్ అవుతుంద‌ని కొందరు అంటున్నారట. జెఏసిల‌ను వీలైనంత త్వ‌రగా ఏర్పాటు చేసి ఉద్య‌మ ప్ర‌ణాళిక‌లను సిద్ధం చేసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం.
వాస్తవం ఆలోచిస్తే ఏడాదిపాటు ప్ర‌త్యేక హెదా ఉద్య‌మాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేది స‌వాలే. ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా పోరాడే వెసులుబాటు ప్ర‌తిప‌క్షాల‌కు స‌హ‌జంగానే ఉంటుంది. కానీ, అధికారంలో ఉంటూ కేంద్రంపై ఉద్య‌మం సాగించ‌డం ఛాలెంజ్ అనే చెప్పాలి. రాబోయే ఏడాది పాటు రాష్ట్రంపై కేంద్రం అనుస‌రించ‌బోయే వైఖ‌రి కూడా వేరేలా ఉంటుంది. రావాల్సిన నిధులూ, చెల్లించాల్సిన బిల్లులూ, ఇత‌ర కేటాయింపులూ ఇలా అన్ని అంశాల్లోనూ భాజ‌పా ధోర‌ణి సానుకూలంగా ఉండే అవకాశం కూడా లేని తరుణంలో తెదేపా ఏం చేస్తుందో చూడాలి.