వంగవీటి రాధపై తెదేపా కన్నేసిందా.?

71
తెలుగుదేశం పార్టీ ఈసారి కుల స‌మీక‌ర‌ణ‌ల‌తో ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మౌతున్న‌ట్టుగా చూడొచ్చు. తెదేపా అంటే కేవ‌లం ఒక సామాజిక వ‌ర్గానికి చెందిన పార్టీగా విమ‌ర్శ‌లుండేవి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆ ముద్ర‌ను చెరిపేసుకుంటూ ప్రాంతాల‌వారీగా ప్ర‌ముఖ సామాజిక వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునే విధంగా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్తున్నార‌ని చెప్పొచ్చు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కాపు సామాజిక వ‌ర్గం ఓటు బ్యాంకు కీల‌కంగా మారే అవ‌కాశం ఉంది. అందుకే, కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశంతో కొంత‌వ‌ర‌కూ ఆ వ‌ర్గాన్ని ప్ర‌సన్నం చేసుకోగలిగారని చెప్పాలి.
రాయ‌ల‌సీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌ల్ని పార్ట‌ీలోకి ఆక‌ర్షించిన విధంగానే, ఇప్పుడు రాజ‌ధాని ప్రాంతంలో ప్ర‌ముఖ కాపు నేత‌ను ఆహ్వానించేందుకు పావులు క‌దులుతున్న‌ట్టు వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో వైకాపా నేత వంగ‌వీటి రాధ‌ పేరు వినిపిస్తోంది. ఈ టాపిక్ బెజ‌వాడ రాజ‌కీయాల్లో ఇదే చ‌ర్చ‌నీయంగా మారింద‌ని స‌మాచారం. వంగ‌వీటి రాధ‌ను పార్టీలోకి పిలిచేందుకు ఇప్ప‌టికే కొన్ని సంప్ర‌దింపులు జ‌రిగాయ‌ని ప్ర‌చారం. కాపు సామాజిక వ‌ర్గం పేరెత్త‌గానే వంగ‌వీటి రంగా గుర్తొస్తారు. ఆయ‌న మ‌ర‌ణించి దాదాపు మూడు ద‌శాబ్దాలైనా కాపు సామాజిక వ‌ర్గంలో ఆయ‌న ఇంకా గుర్తుండిపోయారు. ఆ త‌రువాత ఆయ‌న భార్య వంగ‌వీటి ర‌త్న‌కుమారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. కానీ, ఎక్కువ కాలం క్రియాశీలంగా ఉండ‌లేక‌పోయారు. ఆ త‌రువాత‌, రంగా వార‌సుడిగా వంగ‌వీటి రాధ కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.
గ‌త ఎన్నిక‌ల్లో వైకాపా నుంచి ఆయ‌న పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. అంత‌కుముందు పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో మాత్రమే ఆయ‌న ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న వైకాపాలో ఉన్నాస‌రే పెద్ద‌గా క్రియాశీలంగా లేరు. న‌గ‌ర పార్టీ బాధ్య‌త‌ల నుంచి ఆయ‌న్ని త‌ప్పించిన త‌రువాత మ‌రింత డీలా ప‌డ్డార‌ని చెబుతున్నారు. అయితే, ఆయ‌న పార్టీ బాధ్య‌త‌ల్ని స‌మ‌ర్థంగా నిర్వ‌హించ‌లేక‌పోయార‌నే కారణంతోనే వైకాపాలో రాధ‌కు ప్రాధాన్య‌త త‌గ్గింద‌ని అంటారు.
దీనిని తమకు అనుగుణంగా మార్చుకోవాలని తెదేపా భావిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. వంగ‌వీటి కుటుంబ నేప‌థ్యం తెదేపాకి ప్ర‌ధాన‌మైన ఆక‌ర్ష‌ణీయాంశంగా క‌నిపిస్తోంద‌ని చెప్పుకోవాలి. ఆ కుటుంబం పేరు విన‌గానే కాపు సామాజిక వ‌ర్గంలో కొంత గుర్తింపు, అభిమానం ఉన్నాయి. వైకాపాలో ఈ మ‌ధ్య కాలంలో కొంత‌మంది నేత‌లు చేర‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌ఫున వంగ‌వీటి రాధ‌కు ఎక్క‌డ అవ‌కాశం ఇస్తార‌నే స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం వంటి ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకుతెదేపా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై ప్ర‌స్తుతం రాధ మౌనంగానే ఉంటున్నార‌ని స‌మాచారం.
SHARE