‘ఉక్కు’ దీక్ష సీఎంకు ఉపయోగపడుతుందా.?

236

కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ విరమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు నిమ్మరసం ఇచ్చి పదకొండు రోజులుగా చేస్తున్న దీక్షను విరమింపచేసారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.

ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని మెకాన్ సంస్థ నివేదిక ఇచ్చినప్పటికి కేంద్రం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఆరు నెలల్లో ప్లాంట్‌ పెట్టాలని చట్టంలో ఉన్నా కాలయాపన చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మెకాన్‌ సంస్థ నివేదిక ఇచ్చిందని గుర్తు చేసారు.

వైకాపా వ్యవహారంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసుల కోసం లాలూచీపడి రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ కోసం గండికోటకు నీరు తీసుకొచ్చి నీటి కొరత కూడా లేకుండా చేసామన్నారు. 15కి.మీ. దూరంలో హైవే, రైల్వేలైన్‌ ఉందన్నారు. అందరూ సంఘటితంగా ఉంటేనే కేంద్రం దిగి వస్తుందన్న చంద్రబాబు కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీని సాధించి తీరతామని శపథం చేసారు.

ఏదేమైనా రత్యక్ష ఎన్నికలలో ఇంత వరకూ పోటీ చేయని సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేసినా ప్రజాస్పందన అనూహ్యంగా వచ్చిందని తెదేపా వర్గాలు చెబుతున్నారు. ఈ దీక్ష ఎఫెక్ట్ ను రాజకీయంగా ఉపయోగించేందుకు తెదేపా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.  కడప జిల్లాలో కేంద్రం అన్యాయం చేస్తున్నా జగన్ నోరు మెదపని అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తోంది.