తెరాసతో పొత్తుకై తలో మాట మాట్లాడుతున్నారు

95

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీది ఒంట‌రి పోరాట‌మేనా.?  ఇంతకీ, తెలంగాణ తెలుగుదేశం ప్ర‌స్తుతం ఏం జ‌రుగుతోంది..? రేవంత్ రెడ్డి వెళ్ళినా త‌మ‌కేం న‌ష్టం లేద‌నీ, పార్టీకి వ‌చ్చే ఇబ్బందేం లేద‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఎన్నిక‌లు వ‌చ్చే వ‌ర‌కూ పొత్తుల గురించి మాట్లాడే సంస్కృతి లేద‌ని అంటూనే అదే పొత్తుల విష‌య‌మై ఒక్కొక్క‌రు ఒక్కోలా స్పందిస్తుంటారు. నిజానికి, కాంగ్రెస్ తో తెదేపా పొత్తు కోసం రేవంత్ కొన్ని ప్ర‌య‌త్నాలు చేసారు. ఈ ప్ర‌తిపాద‌న‌ను సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు తీవ్రంగా వ్య‌తిరేకించిన సంగ‌తి తెలిసిందే. రేవంత్ అభిప్రాయాన్ని ఆయ‌నే ముందుగా ఖండించారు.

రేవంత్ పార్టీ వీడిన నేప‌థ్యంలో తెదేపా–తెరాస‌ల మ‌ధ్య దోస్తీకి లైన్ క్లియ‌ర్ అయింద‌నే సంకేతాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ అభిప్రాయాన్ని తెలంగాణ తెదేపా నేత‌లు ఎవ్వ‌రూ ఖండించ‌లేదు. పైగా, దీనిపై పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ సానుకూలంగానే ఉన్న‌ట్టు మొద‌ట్నుంచీ మాట్లాడుతున్నారు. తాజాగా ఓ  ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఏ రాజ‌కీయ పార్టీకీ మ‌రో పార్టీతో శాశ్వ‌త శ‌త్రుత్వం ఉండద‌న్నారు, తెరాస విష‌యంలో కూడా ఇది వ‌ర్తిస్తుంద‌న్నారు. ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితులు ఎలా మారుతాయో చెప్ప‌లేమంటూ  తెరాస‌తో పొత్తుపై ఉన్న అవ‌కాశాల‌ను చెప్ప‌క‌నే చెబుతున్నారు.

ఇదే స‌మ‌యంలో తెదేపా నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు పొత్తు విష‌య‌మై మ‌రో ర‌కంగా మాట్లాడారు. న‌ల్గొండ‌లో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెదేపాది ఒంట‌రి పోరాట‌మే అన్నారు. తెలంగాణ‌లో పార్టీ చాలా బ‌లంగా ఉంద‌ని కొంత‌మంది స్వార్థ‌ప‌రులు పార్టీని వీడినా న‌ష్టం లేద‌న్నారు. త‌మ శ‌క్తి ఏంటో నిరూపించుకోవ‌డం కోసం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీకి సిద్ధ‌మౌతున్నామ‌న్నారు. తెరాస‌తో పొత్తుకు ఆస్కారం ఉంద‌ని పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ర‌మ‌ణ చెబుతుంటే, ఒంట‌రిగానే పోరాటం అంటూ పోలిట్ బ్యూరో స‌భ్యుడు మోత్కుప‌ల్లి అంటున్నారు.

ఇంత‌కీ, ఎవ‌రి మాట సరైంది..? పొత్తుల గురించి ఎన్నిక‌ల‌ప్పుడు మాత్ర‌మే ఆలోచిస్తామ‌ని చెప్పే తెదేపా  నేత‌లే ప‌రస్ప‌ర విరుద్ధ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేయ‌డాన్ని ఎలా చూడాలి? పొత్తుల గురించి రేవంత్ మాట్లాడితే అది పార్టీ అధినాయ‌క‌త్వం తీసుకోవాల్సిన నిర్ణ‌యమని ఆనాడు చెప్పారు. మ‌రి, మోత్కుప‌ల్లి, ర‌మ‌ణ మాట‌ల్ని ఇప్పుడు ఎలా చూడాలి? ఇలాంటి వ్యాఖ్య‌ల వ‌ల్ల రాష్ట్రంలో కార్య‌క‌ర్త‌లు గంద‌ర‌గోళానికి గురి అవుతారు క‌దా!