భాజపా తీరు తెదేపా నేతలకు నచ్చట్లేదట

310

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంగా వైకాపా విష‌యంలో భాజ‌పా అనుస‌రిస్తున్న విధానాలు ఏపీ తెదేపా నేత‌ల‌కు మింగుడుప‌డ‌టం లేదు. ఎన్డీయే రాష్ట్రప‌తి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ కు ఏపీలోని తెదేపాతో పాటు, వైకాపా కూడా మ‌ద్ద‌తు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో విడ‌త‌ల వారీగా జ‌రిగే నామినేష‌న్ ప‌త్రాల దాఖ‌లు కార్య‌క్ర‌మానికి మొద‌ట చంద్ర‌బాబును భాజ‌పా ఆహ్వానించింది. నాలుగో విడ‌త నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి వైకాపాని కూడా పిలిచింది. నాలుగో సెట్ నామినేష‌న్ ప‌త్రాల‌పై రాష్ట్రప‌తి అభ్య‌ర్థి కోవింద్ ను బ‌ల‌ప‌రుస్తూ వైకాపా ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి సంతకం తీసుకున్నారు. ఈ విష‌యం తెదేపా నేత‌ల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తోంది.

ఆ మ‌ధ్య, జ‌గ‌న్ కు ప్ర‌ధాని అపాయింట్మెంట్ ఇవ్వ‌డంపై తెదేపా టీడీపీ నేత‌ల తీవ్ర అసంతృప్తికి గుర‌య్యారు. మంత్రుల ద‌గ్గ‌ర నుంచీ ఎమ్మెల్యేలూ ఎమ్మెల్సీలంద‌రూ భాజ‌పా తీరుపై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. అయితే, ఆ సంద‌ర్భంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు జోక్యం చేసుకుని, భాజపాపై ఎవ్వ‌రూ ఎలాంటి విమ‌ర్శ‌లూ చెయ్యొద్ద‌ని చెప్ప‌డంతో ఆ ఇష్యూకి అప్ప‌టికి ఫుల్ స్టాప్ ప‌డింది. ఏ పార్టీతో కావాలంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే స్వేచ్ఛ భాజ‌పాకి ఉంటుంద‌నీ, కానీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ళు ఉండ‌గా వైకాపాతో ఇలా ఎలా వ్య‌వ‌రిస్తారంటూ భాజ‌పా తీరుపై కొంత‌మంది తెదేపా నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం.

జ‌గ‌న్ కు ప్ర‌ధాని అపాయింట్మెంట్ ఇచ్చిన రోజునే భాజ‌పాని చంద్ర‌బాబు నిల‌దీసి ఉండి ఉంటే.. ఇవాళ్ల ఇలా జ‌రిగి ఉండేది కాద‌నీ, వైకాపా ఎంపీతో క‌లిసి మ‌రీ వెంక‌య్య నామినేష‌న్ ప‌త్రాలు స‌మ‌ర్ప‌ణ‌కు వెళ్ళారంటే ఇదంతా మోడీ మాస్ట‌ర్ ప్లాన్ అయి ఉంటుంద‌నీ వాపోతున్నార‌ట‌. ఈ అసంతృప్త స్వరం చంద్ర‌బాబు వ‌ర‌కూ వెళ్ళింద‌నీ గ‌తంలో చెప్పిన‌ట్టుగానే భాజ‌పాని ఎవ్వ‌రూ ఏమీ అనొద్ద‌ని అన్నట్లుగా తెలుస్తోంది.