తెదేపాలో మరో ధ్రువతార రాలిపోయింది

324
తెదేపా సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు హఠాన్మరణం చెందారు. 71 సంవత్సరాలు వయసున్న ఆయన మంగళవారం అర్ధరాత్రి కన్నుమూసారు. ఇటీవలే గుండె ఆపరేషన్ చేయించుకున్న ఆయన రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన ఆయన ఎన్టీఆర్‌ పిలుపుతో 1983లో రాజకీయ రంగప్రవేశం చేసారు. పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. విద్య, అటవీశాఖ, ఉన్నత విద్య మంత్రిగా పనిచేసారు.
ముద్దుకృష్ణమ చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురం గ్రామానికి చెందిన రామానాయుడు, రాజమ్మ దంపతులకు జూన్‌ 9వ తేదీ 1947లో జన్మించారు. చిన్నప్పుడే తండ్రి హత్యకు గురికావడం, ఆ బాధతో తల్లి రాజమ్మ కూడా మృతి చెందారు. దీంతో ఆయన పిచ్చాటూరు మండలం రామగిరిలో మేన మామల వద్ద పెరిగారు. ప్రాథమిక విద్య వెంకట్రామాపురం, రామగిరి, ఉన్నత పాఠశాల విద్య నాగలాపురం, ఇంటర్‌, డిగ్రీ తిరుపతి ఎస్వీలో పూర్తి చేశారు. ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చదివిన ఆయన గుంటూరులోని పెద్ద నందిపాడు ఎయిడెడ్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పదేళ్ళు పనిచేసారు.
మంత్రిగా పలు కీలక శాఖల బాధ్యతలు చేపట్టిన ఆయన ఎన్నో సంస్కరణలకు తెరతీసారు. నిరంతరం అభివృద్ధే ఆయన లక్ష్యం. గతంలో పోటీచేసిన పుత్తూరు నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ఆపై నగరి నియోజవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రత్యేకించి పుత్తూరు పురపాలక సంఘ పరిధిలో కోట్లాది రూపాయలతో చేపట్టిన పనుల్లో ఆయన మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. పదవిలోఉన్నా, లేకున్నా అభివృద్ధే ఆయన ప్రధాన ధ్యేయం.
1994 తెలుగు దేశం సంక్షోభం సమయంలో ఎన్టీయార్-లక్ష్మీపార్వతిల వైపు ఉన్నారు. ఆ తర్వాత చాలా కాలానికి చంద్రబాబు తో కలిసిపోయారు. తెలుగుదేశంతో విభేధించి కాంగ్రెస్‌లో చేరి 2004 ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యునిగా గెలుపొందారు. తిరిగి 2008లో తెదేపాలో చేరి 2009 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి రోజాపై పోటీ చేసి వెయ్యి లోపు ఓట్లతో ఓడిపోయారు. ఆయన మరణంతో తెలుగుదేశం వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆయనకు భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రేపు స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాపురం లో అంత్య క్రియలు జరగనున్నాయి.