‘జేసీ’కి మాత్రమే సాధ్యమైన రాజకీయమిది

136

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సొంత పార్టీనే బ్లాక్ మెయిల్ చేయడంలో పండిపోయారు. ఇదే బాటలో తన డిమాండ్లు పూర్తి చేసుకోవటంలో మరో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో తాను ఓటింగ్ కు హాజరు కాబోనంటూ ప్రకటించి అసంతృప్తిని వెళ్ళగక్కారు.

తన డిమండ్లు ఏమిటో హైకమాండ్‌కు కూడా తెలుసున్నట్లుగా హింట్ ఇచ్చారు. దీంతో అధినేత చంద్రబాబు జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన డిమాండ్ ను పరిష్కరించారు. అనంతపురంలో రహదారుల విస్తరణకు రూ.45 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ప్రత్యేకంగా అమరావతి పిలిపించుకున్న చంద్రబాబు ఆయనతో చర్చలు జరిపి రోడ్ల విస్తరణ జీవోను విడుదల చేసారు.

 

సీనియర్ అయిన తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని జేసీ అసంతృప్తికి గురయినట్లు ప్రచారం జరిగింది. కానీ అనంతపురంలో రోడ్ల విస్తరణతో పాటు అనుచరులను పార్టీలో చేర్చుకునే విషయంపై అధినేత తేల్చకపోవడమని చెబుతున్నారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ నేత గుర్నాథరెడ్డిని జేసీ దివాకర్ రెడ్డి పార్టీలో చేర్చారు. ఆయనకు ఇంత వరకూ ఎలాంటి పదవి ఇవ్వలేదు.

వాస్తవానికి గతేడాది కూడా ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కలకలం రేపారు. చాగల్లు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలనే డిమాండ్ తో రాజీనామా అస్త్రం సంధించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చాగల్లు రిజర్వాయర్‌కు నీరు విడుదల చేయడంతో శాంతించారు. ఇప్పుడు అనంతపురంలో రోడ్ల విస్తరణకూ ఆలాగే ఆమోదం పొందారు. ఇతర నేతలు ఎవరైనా  బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తే రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడిపోతుంది. కానీ జేసీ మాత్రం అనుకున్నది సాధించుకుంటున్నారు.